విశాఖలోని రసాయన పరిశ్రమలో అర్థరాత్రి పేలుళ్లు.. భారీ అగ్ని ప్రమాదం..  

వ‌రుస ప్ర‌మాదాలతో విశాఖ వ‌ణికిపోతోంది. తాజాగా పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో భారీ పేలుడు సంభవించింది. సాల్వెంట్‌ ‌ఫార్మా కంపెనీలో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో భారీ శబ్దాలతో ట్యాంకులు పేలి 30 నుండి 50 అడుగుల ఎత్తు వరకు మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్కనే ఉన్నకెమికల్ డ్రమ్ములకు మంటలు వ్యాపించడం తో పరిసర ప్రాంతాల‌ను ద‌ట్ట‌మైన‌ పొగ చుట్టేసింది. భారీ పేలుడు శబ్దాలు దాదాపు పది కిలోమీటర్ల వరకు వినిపించాయి. ఫార్మా సిటీ కి దగ్గరలోని హై టెన్షన్ విద్యుత్ వైర్లు కూడా తెగి పడ్డాయి. దీంతో ఏం జ‌రుగుతుందో తెలియ‌క స్థానికులు భ‌యంతో ప‌రుగులు తీశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘ‌ట‌న‌ మరువకముందే మ‌రో ప్ర‌మాదం జ‌ర‌గ‌డం తో వైజాగ్ ‌వాసుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. అదే సమయంలో ఆ కంపెనీ చుట్టుపక్కల ఉన్న కంపెనీల నుండి ఉద్యోగులు పరుగులు తీశారు. ఇంకా పరిసర గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

వ‌రుస‌గా అనేక పేలుళ్లు సంభవించ‌డంతో లోప‌ల ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అంతే కాకుండా ఘటన జరిగిన ప్రదేశం నుండి 200 మీటర్ల వరకు వేడి తీవ్రంగా ఉండడంతో ఫైర్ సిబ్బంది సైతం లోప‌లికి వెళ్లే సాహ‌సం చేయ‌లేక‌పోయారు.

చుట్టూ పక్కల జిల్లాల లో ఉన్న ఫార్మా పరిశ్రమల నుండి హెచ్ సి ఎల్, ఇథనాల్ వంటి రసాయనాలు సేకరించి వాటిని శుద్ధి చేసి హైదరాబాద్ చెన్నై లోని పరిశ్రమలకు సప్లై చేస్తుంది. నిన్న రాత్రి సాల్వెంట్‌ ‌ ఫార్మా కంపెనీలో నైట్‌ షిప్ట్‌ మొదలైన కొద్దిసేప‌టికే ఈ పేలుడు జ‌రిగింది. ఐతే ప్రమాదం జరిగిన సమయంలో న‌లుగురు సిబ్బంది విధుల్లో ఉన్న‌ట్టుగా అధికారులు చెప్పారు. ఐతే ఈ ప్ర‌మాదంలో నలుగురు సిబ్బంది గాయపడగా వెంట‌నే వారిని గాజువాకలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.