కిరణ్ పై కాంగ్రెస్ నేతల ఎదురు దాడి షురూ
posted on May 11, 2015 7:35AM
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర విభజన ఏవిధంగా జరిగిందో, తెర వెనుక ఎటువంటి రాజకీయాలలో నడిచాయో, దానిలో కాంగ్రెస్ నేతల పాత్ర గురించి వివరిస్తూ ఒక పుస్తకం వ్రాస్తున్నారు. అది త్వరలో విడుదల కాబోతోంది. రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ నేతలు ప్రజలతో ఆడిన డబుల్ గేమ్ గురించి అందులో ఆధారాలతో సహా బయటపెట్టబోతున్నారు.
రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోగా, తెలంగాణా రాష్ట్రంలోను ఎన్నికలలో ఓడిపోయినా తరువాత నేటి వరకు కోలుకోలేకపోతోంది. మూలిగే ముసలి నక్కపై తాటి పండు పడినట్లుగా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వ్రాస్తున్న అ పుస్తకం వచ్చి పడుతోంది. సహజంగానే అది ఆ పార్టీకి మరింత నష్టం కలిగించే అవకాశం ఉంటుంది కనుక, ఊహించినట్లే అప్పుడే కాంగ్రెస్ నేతలు ఆయనపై ఎదురు దాడి ప్రారంబించేసారు.
అందరి కంటే ముందుగా సోనియా గాంధీకి వీర విధేయుడినని గర్వంగా చెప్పుకొనే సీనియర్ కాంగ్రెస్ నేత మరియు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు స్పందిస్తూ “కాంగ్రెస్ అధిష్టానం ఆయనను నమ్మి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే ఆయన రెండు రాష్ట్రాలలో కూడా పార్టీని, ప్రభుత్వాన్ని ముంచేసాడని తీవ్రంగా విమర్శించారు. ఆయన తన ముఖ్యమంత్రి పదవిని తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకొన్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రిని చేసినందుకు కృతజ్ఞత చూపకపోగా తిరిగి సోనియా గాంధీని అప్రతిష్టపాలు చేయడానికే ఆయన పనిగట్టుకొని పుస్తకం వ్రాయడం చాలా దారుణమని హనుమంత రావు ఆవేదన వ్యక్తం చేసారు.