ఆ అరెస్టు వెనుక భారీ కుట్ర!?
posted on Nov 20, 2024 5:58AM
దేశ రాజకీయాల్లో అత్యంత పలుకుబడి, విశ్వసనీయత కలిగిన అతికొద్ది మంది నేతల్లో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒకరు. ఆయన హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లోనూ అభివృద్ధి పరుగులు పెట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని యువత నేడు ఐటీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా రాణిస్తున్నారంటే అందుకు చంద్రబాబు దార్శనికతే కారణం అనడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేస్తారు. తాను నిజాయితీగాఉంటూ, తన పరిధిలో పని చేసే ప్రజాప్రతినిధులు, అధికారులు నిజాయితీగా పనిచేసేలా చంద్రబాబు పాలన ఉంటుంది. అలాంటి నిజాయితీ కలిగిన, నిబద్ధత ఉన్న నేతను వైసీపీ హయాంలో అనేక ఇబ్బందులకు గురి చేశారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారు. జైల్లోనూ సరైన సౌకర్యాలు కల్పించకుండా నానా ఇబ్బందులూ పెట్టారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దేశ వ్యాప్తంగా, ప్రపంచం నలుమూలలా తెలుగు వారు ఉన్న ప్రతి దేశంలోనూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆయన అరెస్టును ఖండిస్తూ నిరసనలకు దిగారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును అరెస్టు చేసిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 53 రోజుల తరువాత బెయిల్ రావడంతో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే, అప్పట్లో చంద్రబాబు అరెస్టు వెనుక భారీ కుట్ర జరిగిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలతో పాటు.. ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. దోచుకోవడం, దాచుకోవడం, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపే పాలన అన్న చందంగా జగన్ హయాంలో అరాచకం రాజ్యమేలింది. ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాటి నుంచి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలుకు పంపించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు తన హయాంలో తప్పు చేసినట్లు జగన్ ప్రభుత్వానికి ఆధారాలు దొరకలేదు. దీంతో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైల్లో చంద్రబాబును హతమార్చేందుకు కుట్రలు సైతం జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. తనకు సరైన సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులు పెట్టారని, ఒకానొక సమయంలో తనను హతమార్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అప్పట్లో చంద్రబాబుపై పెట్టిన కేసులు అక్రమేనని మెజార్టీ ప్రజలు నమ్మారు. ప్రస్తుతం అదే నిజమవుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం వెనుక పెద్ద కుట్ర జరిగిందని సీనియర్ ఐఏఎస్, నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ తాజాగా స్పష్టం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెట్ ప్రాజెక్టు ద్వారా 2016-19 మధ్య కాలంలో నాలుగు లక్షల మంది నిరుద్యోగ యువత, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఇతర కాలేజీల్లో వందల కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు, ల్యాబ్ లు ఏర్పాటుచేసి శిక్షణ కేంద్రాలు నెలకొల్పింది. ఈ శిక్షణ కేంద్రాల ద్వారా సుమారు 1.82 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. అయితే, ఈ పథకంలో రూ. 241 కోట్ల నిధులు చేతులు మారి సూట్‌కేసు కంపెనీలకు వెళ్లాయని, దీనికి నాటి సీఎం చంద్రబాబు నాయుడే ప్రధాన కారకులని గత జగన్ ప్రభుత్వం నిరూపించాలనుకుంది. ఈ క్రమంలో ఆయనపై అక్రమ కేసులు బనాయించింది. చంద్రబాబు అరెస్టు చేయడం కోసం సీఎంవో, సీఐడీ, స్కిల్ డెవలప్ మెంట్ శాఖల్లో పైళ్లను మాయం చేశారని, ఏకకాలంలో మూడు విభాగాల్లో పైళ్లు కనిపించకుండా పోయాయని ఓ తెలుగు మీడియా న్యూస్ ఛానల్ జరిపిన డిబేట్ లో పీవీ రమేశ్ స్పష్టం చేశారు. అలాగే నిధుల విడుదలకు సంబంధించి అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశించారని, తాను స్టేట్మెంట్ ఇచ్చానంటూ జగన్ సర్కార్ తప్పుడు సమాచారం ఇచ్చిందని పీవీ రమేష్ చెప్పారు.
ఇదే విషయాన్ని తాజాగా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం (నవంబర్ 19) ప్రస్తావించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పట్లో చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక భారీ కుట్ర జరిగిందని, అప్పటి సీఎంవో, సీఐడీ, స్కిల్ అధికారులు కలిసి కీలక ఫైళ్లు మాయం చేశారని అసెంబ్లీలో శ్రీధర్ రెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబులాంటి జాతీయ స్థాయి నేతకే అలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని అసెంబ్లీలో ప్రశ్నించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉందని, అవసరమైతే జీరో అవర్ ను నిలిపివేసి, ఈ విషయంపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చజరపాలని, చంద్రబాబు కుట్ర వెనుక కుట్రదారులను అరెస్టు చేయాలని శ్రీధర్ రెడ్డి సభ దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాదు.. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో.. బాబు జైలు గదిలో ఏం చేస్తున్నారో తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ మోహన్ రెడ్డి వీక్షించే వారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును అప్పట్లో జగన్ సర్కార్ కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పట్లో రఘురామకృష్ణం రాజును కస్టడీలో చిత్రహింసలకు గురి చేస్తూ ఆ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా జగన్ కూ చూపించారు. ఈ విషయాన్ని రఘురామకృష్ణం రాజు పలు సందర్భాలలో చెప్పారు. దానిని బట్టి చూస్తే చంద్రబాబును జైల్లోఇబ్బందులు పెడుతున్న దృశ్యాలను కూడా జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి చూసి రాక్షసానందం పొందేవారన్న ఆరోపణలు వాస్తవమే అనిపించక మానదు. మొత్తానికి చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ అరెస్టు చేసి జైలుకు పంపించిన జగన్ ప్రభుత్వం, అందుకు తగ్గట్లుగా ఎటువంటి ఆధారాలనూ కోర్టుకు సమర్పించలేక పోయింది. తాజాగా చంద్రబాబు అరెస్టు వెనుక భారీ కుట్ర జరిగిందని ఆధారాలు వెలుగులోకి వస్తుండటంతో.. కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించి సభ విచారణకు ఆదేశిస్తే జగన్ మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు, కుట్రలో భాగమైన అధికారులు జైలు ఊచలు లెక్కించడం ఖాయమని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.