జయలలితకి జైలా...బెయిలా...తేలేది నేడే

 

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధింపబడిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, గతేడాది సెప్టెంబర్ నెలలో వారం రోజులపాటు జైలులో గడపవలసి వచ్చింది. కానీ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించి బెయిలుపై మళ్ళీ బయటకు రాగలిగారు. సుప్రీంకోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేస్తూ ఆమె కేసును విచారిస్తున్న కర్ణాటక హైకోర్టును మూడు నెలలలోగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించవలసిందిగా ఆదేశించింది. కానీ జడ్జీల బదిలీ తదితర కారణాల వలన ఆ కేసు విచారణ ఆలస్యమయింది. ఆమె కేసుపై కర్ణాటక హైకోర్టు ఈరోజు తుది తీర్పు చెప్పబోతోంది.

 

ఒకవేళ హైకోర్టు కూడా ఆమెకు ప్రత్యేక కోర్టు వేసిన శిక్షనే ఖరారు చేసినట్లయితే ఆమె మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు. అదే జరిగితే మళ్ళీ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించడం కూడా ఖాయం. కానీ సుప్రీంకోర్టు మళ్ళీ ఆమెకు బెయిలు మంజూరు చేసేవరకు జైలు జీవితం తప్పకపోవచ్చును. అయితే ఆమె ఈరోజు కర్నాటక హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదు కనుక ఆమె చెన్నైలో తన విలాసవంతమయిన పోయస్ గార్డెన్స్ నివాసంలోనే ఉంటారు. తమిళనాడులో ఆమె పార్టీ- ఏ.ఐ.ఏ.డి.యం.కె. పార్టీయే ప్రస్తుతం అధికారంలో ఉంది కనుక ప్రభుత్వం ఆమెను జైలుకి తరలించకుండా గృహ నిర్బంధంలో ఉంచుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.