నేటి నుండి జగన్ రైతు భరోసాయాత్ర

 

ఇంతకు ముందు తన తండ్రి వై.యస్స్. రాజశేఖర్ రెడ్డి మరణానికి తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదార్చడానికి అంటూ ఓదార్పు యాత్రలు చేసి, పనిలోపనిగా తన పార్టీని బలోపేతం చేసుకొన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలలో మాత్రం గెలవలేకపోయారు. తన పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వంపై అప్పటి నుండి ఆయన యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా యాత్రల పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నుండి నాలుగు రోజుల పాటు చేయబోయే రైతు భరోసా యాత్రలో అనంతపురం జిల్లాలో గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. పేరుకి అది రైతు భరోసా యాత్రే అయినా దాని కోసం వైకాపా చేస్తున్న హడావుడి చూస్తుంటే అది రైతులపై సానుభూతి చూపేందుకా లేక రైతుల తరపున వైకాపా పోరాడుతోందని ప్రచారం చేసుకోవడానికా? అనే అనుమానం కలుగక మానదు.