మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ!
posted on Nov 20, 2024 9:08AM
అత్యంత కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం (నవంబర్ 20) ఉదయం ఆరంభమంది. ఉదయం ఏడుగంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకూ సాగుతుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలతో కూడిన మహా వికాస్ అఘాడీ బరిలో ఉన్నాయి. హోరాహోరీ పోరుతప్పదన్న అంచనాల నేపథ్యంలో మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వం ఎవరిదన్న విషయాన్ని ఈ ఎన్నికలు తేల్చేస్తాయి. 288 నియోజకవర్గాలకు గాను మొత్తం 4, 136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో అత్యధికంగా 2,086 మంది ఇండిపెండెంట్లు కావడం విశేషం.
గత ఎన్నికలలో 2019లో 3,239 మంది అభ్యర్థులు పోటీ చేయగా... ఈసారి అభ్యర్థుల సంఖ్య ఏకంగా 28 శాతం పెరిగింది. ప్రధాన పోటీ దారులైన రెండు కూటములూ కేడా రెబల్స్ బెడద ఎదుర్కొంటున్నాయి. సగానికి పైగా నియోజకవర్గాలలో రెబల్స్ బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా తాము ఆశించిన విధంగా పార్టీ టికెట్ దక్కని నేతలు రెబల్స్ గా బరిలోకి దిగారు. ఒకే దశలో పోలింగ్ జరుగుతుండడంతో ఎన్నికల సంఘం రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించి పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశ రాజధాని నగరం ముంబైలో అయితే ఏకంగా 30,000 మందిని భద్రత విధుల్లో నియోగించారు.
ఇలా ఉండగా ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కూడా సోమవారమే జరుగుతోంది. ఈ విడతలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, ఆయన సతీమణి కల్పనా సొరేన్, ప్రతిపక్ష నేత అమర్ కుమార్ బౌరీ సహా పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు.