యాంటిసిపేటరీ బెయిలు కోసం రామ్ గోపాల్ వర్మ పిటిషన్

 వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టు భయంతో వణికి పోతున్నారు. పోలీసులు తనపై ధర్డ్ డిగ్రీ  ప్రయోగిస్తారని భయపడుతున్నారు. ఇదే రామ్ గోపాల్ వర్మ జగన్ అధికారంలో ఉండగా మంచీ చెడూ పట్టించుకోకుండా అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్ ల మార్ఫింగ్ ఫోటోలతో, అనుచిత పోస్టులతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు.  జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ జగన్ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితికి వచ్చేశారు.

గతంలో ఆయన సోషల్ మీడియాలో చేసిన అనుచిత పోస్టులపై కేసు నమోదైంది. విచారణకు రావాల్సిందిగా నోటీసులు కూడా అందాయి. దీనిపై రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన మంగళవారం (నవంబర్ 19) ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే వ్యక్తిగత పనులున్నాయంటూ వాట్సాప్ మెసేజ్ పెట్టి విచారణకు డుమ్మా కొట్టారు. తనకు విచారణకు హాజరయ్యేందుకు నాలుగు రోజుల వ్యవధికావాలంటూ కోరారు. అటువంటి రామ్ గోపాల్ వర్మ బుధవారం (నవంబర్ 20)   హైకోర్టులో వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్  దాఖలు చేశారు.

తాను ఎవరి పరువుకూ భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేదని ఆ పిటిషన్ లో పేర్కొన్న రామ్ గోపాల్ వర్మ, రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని, తనను అరెస్ట్ చేసి,  థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.