కేసీఆర్‌కి డుమ్మాలు అలవాటైపోయింది


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, ఆయన వ్యవహార శైలి మీద ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ఆయన ఎంతమాత్రం మారరు. అదే ఆయన శైలి. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని విమర్శలు వచ్చినా తాను చేయాలనునకున్నది చేసేయడం ఆయన తత్వం. ఎంతైనా దొర కదా! ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హాజరు కావలసిన కార్యక్రమాలకు కూడా తన కుమారుడు కేటీఆర్నో, మరొకరినో పంపించి తాను మాత్రం ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ని ఫామ్ హౌస్ సీఎం అని ప్రతిపక్షాలు ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ ఆయన తన ధోరణిని మార్చుకోవడం లేదు. పలువురు ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవడం పట్ల ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులు చిన్నబుచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఏ జ్వరమో జలుబో వస్తే కార్యక్రమాలకు హాజరు కాకపోతే పర్లేదు... అంతా బాగున్నా ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడమేంటో అర్థం కావడం లేదని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. తాజాగా జరిగిన ఇలాంటి ఒక కార్యక్రమాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

గురువారం నాడు టాటా సంస్థల మాజీ అధినేత హైదరాబాద్‌లో జరిగిన ఒక కీలకమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఐఐటీలో ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంలో రూపొందిన అతిపెద్ద ఇంక్యుబేటర్ హబ్‌ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథితిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనాల్సిన కార్యక్రమం ఇది. అయితే ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాత్రమే పాల్గొన్నారు. ఎక్కడో ముంబైలో వున్న తాను వచ్చినప్పటికీ, ఇక్కడే వున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడం పట్ల రతన్ టాటా చిన్నబుచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య ఆయన ఆంధ్రప్రదేశ్‌‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రతన్ టాటాతో భేటీ అయ్యారు. రతన్ టాటా ఆ సందర్భంగా ఏపీలోని 264 గ్రామాలను దత్తత కూడా తీసుకున్నారు. రతన్ టాటా లాంటి వ్యక్తం వచ్చినప్పుడు ఆయనను సముచిత రీతిన గౌరవించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకారం కోరాల్సింది బదులు.. అసలు ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో పాల్గొనకపోవడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్ ఇలా డుమ్మా కొట్టడం బాగా అలవాటు చేసుకున్నారని విమర్శిస్తున్నాయి.