సీమ పోరాటానికి ఆజ్యం పోస్తున్న వారు సీమ కోసం ఏమి చేసారు?
posted on Nov 6, 2015 3:22PM
వైకాపా సీనియర్ నేత ఎం.వి. మైసూరా రెడ్డి ఈ నెల 20న పార్టీకి రాజీనామా చేసి, 21వ తేదీన రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర సాధన సమితి’ ని స్థాపించబోతున్నట్లు వార్తలు వచ్చేయి. దాని కోసం సీమకు చెందిన కాంగ్రెస్, వైకాపా నేతలు ఇప్పటికే ఒకసారి సమావేశమయ్యారు. మళ్ళీ త్వరలో తిరుపతిలో మరోమారు సమావేశం కాబోతున్నట్లు మాజీ మంత్రి డి.ఎల్. రవీంద్రా రెడ్డి చెప్పారు. మళ్ళీ చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూనే, ప్రత్యేక రాష్ట్రం కోసం తాము చేయబోయే ఉద్యమానికి రాయలసీమ వాసులయిన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ మద్దతు ఈయాలని కోరడం విశేషం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తారని ఆయన ఏవిధంగా ఆశిస్తున్నారో తెలియదు.
ఈ ఉద్యమానికి వైకాపా నేత మైసూరా రెడ్డి నాయకత్వం వహించడం నిజమయితే ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు అనుమానించక తప్పదు. తనపై అనుమానం కలుగకూడదనే ఆలోచనతోనే మైసూరా రెడ్డి చేత పార్టీకి రాజీనామా చేయిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకి జగన్మోహన్ రెడ్డి వెనుక నుండి ప్రోత్సహిస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.
గత అనుభవాల నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోకుండా సున్నితమయిన ఈ సమస్యపై వైకాపా అనాలోచితంగా, దుందుడుకుగా వ్యవహరిస్తే రాష్ట్రం మళ్ళీ అగ్ని గుండంగా మారే ప్రమాదం ఉంది. రాయలసీమ ప్రాంతం చాలా దశాబ్దాలుగా పాలకుల నిరాదరణకు గురయింది. విచిత్రం ఏమిటంటే రాష్ట్రాన్ని ఏలినవారిలో చాలా మంది సీమకు చెందినవారే అయ్యి ఉండటం. పాలకులు, ప్రజా ప్రతినిధులకు తమతమ నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకోవాలనే తపన, పట్టుదల ఉంటే, అందుకు అవసరమయిన కృషి చేసినట్లయితే దేశంలో ఏ ప్రాంతము కూడా వెనుకబడి ఉండదు. కానీ చాలా మంది నేతలు తమ రాజకీయ ప్రయోజనాలు, పదవులు, అధికారం, కాంట్రాక్టులు, అక్రమార్జనలపై ఉన్నంత ఆసక్తి తమతమ నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకోవడంపై చూపకపోవడం వలననే దేశంలో చాలా రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు.
ఇప్పుడు రాయలసీమ కోసం ఉద్యమించడానికి సిద్దమవుతున్నవారిలో ఎంతమంది నేతలు తమ తమ నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకొన్నారు? తమ చేతిలో ఉన్న అధికారం లేదా పలుకుబడితో తమ ప్రాంతంలో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయించారు? ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించారు? అసలు ప్రజల కోసం ఏమి చేయగలిగారు?అని వారిని సమర్దిస్తున్నవారు ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. అటువంటి స్వార్ధ రాజకీయ నాయకులను నమ్ముకోవడం కంటే, సీమ ప్రజలే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు కావలసినవన్నీ సాధించుకోవడం మంచిది.