బిఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురేనా? సబిత చూపు కాంగ్రెస్ వైపే

గత కొంతకాలంగా బిఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు , ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయవంతంగా దూసుకెళ్తుంది గత అసెంబ్లీలో బిఆర్ఎస్ అట్టర్ ప్లాప్ కావడంతో పార్లమెంటు ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవాలని భావించిన బిఆర్ఎస్ కు చుక్కెదురైంది. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ జీరోకి పడిపోయింది. గత వారం చేవెళ్ల కాలేయాదయ్య, పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాలె యాదయ్య అయితే తాను చచ్చే వరకు బిఆర్ఎస్ లో కొనసాగుతానని చెప్పి తీరా కాంగ్రెస్ లో చేరారు. మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరగడంతో ఆయన అధికారపక్షమైన కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణలో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మాజీ స్పీకర్ పోచారంశ్రీవివాస్ రెడ్డి కెసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అతనికి కెసీఆర్ స్పీకర్ పదవి కట్టబెట్టారు. బిఆర్ఎస్ లో అత్యంత ముఖ్యమైన నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న పోచారం చివరకు కాంగ్రెస్ లో చేరడాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. పోచారం కాంగ్రెస్ లో చేరే ముందు హరీష్ రావు బుజ్జగించారు. అయినప్పటికీ పోచారం తన మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ లోచేరుతున్నట్టు ప్రకటించారు. సబితా ఇంద్రారెడ్డి బిఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఒకరుగా కొనసాగుతున్నారు. అయితే కెసీఆర్ ఇటీవలె తన ఫామ్ హౌజ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కెసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సబితా ఇంద్రారెడ్డి డుమ్మా కొట్టారు. అప్పట్నుంచి సోషల్ మీడియాలో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. బడంగ్ పేటలో గత శుక్రవారం ఆమె పాదయాత్ర చేస్తున్నప్పుడు కొందరు విలేకరులు మీరు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. రేవంత్ కేబినెట్ లో ఉంటారని మీడియాలో కథనాలు వస్తున్నాయి అన్నప్పుడు ఆమె ఖండించకపోగా మంత్రి పదవి రావడం అదృష్టం ఉంటేనే దక్కుతుంది అని ఆమె అనడంతో  సబిత పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తనకు మంత్రి పదవి, తన కుమారుడికి కార్పోరేషన్ చైర్మన్  పదవి అని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపించింది.      అయితే ఈ వార్తలను సబితా ఇంద్రారెడ్డి ఖండించారు. తనకు బిఆర్ఎస్ పార్టీలో ప్రత్యేక స్థానం ఇచ్చారని పైకి చెబుతున్నప్పటికీ సబిత కాంగ్రెస్ లో చేరడం ఖాయమనే ప్రచారం మరింత ఎక్కువైంది. బిఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరూ కారు దిగిపోతుండటంతో చివరకు కెసీఆర్ కుటుంబానికి చెందిన కెటీఆర్, హరీష్ రావ్, కవిత మాత్రమే బిఆర్ఎస్ లో మిగుల్తారని నెటిజన్లు కామెంట్స్ పాస్ చేస్తున్నారు.