కీళ్ల ఆరోగ్యం కులాసాయేనా??

ఒకప్పుడు అరవై సంవత్సరాలు దాటినా ఆరోగ్యంగా ఉంటూ ఎన్నో పనులు చేసుకుంటూ చక్కని జీవితం సాగించేవారు. మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో ఇలాగే ఉండేది. అందుకే వారు ఇప్పటికీ 80,90 సంవత్సరాల వయసుకు చేరువ అయినా ఒకరి మీద ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకుంటూ ఉండగలుగుతున్నారు. అయితే వీరి మనవళ్లు, మనవరాళ్లు మాత్రం 40 సంవత్సరాలు కూడా పూర్తి కాకనే కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా కీళ్ల సమస్యలు ఇప్పటి తరాన్ని చాలా వేధిస్తున్నాయి. 


ఎముకలు శరీరంలో చట్రాన్ని ఏర్పరిస్తే, అందులో వున్న కీళ్ళు మనిషి కదిలేట్లు చేస్తాయి. రెండు లేక మూడు ఎముకలు కలిసే ప్రదేశాన్ని 'కీలు’ అంటామనే విషయం మనకు తెలిసిందే.. పుర్రెలో వున్న ఎముకల కలయిక తప్ప మిగతా కీళ్ళన్నీ కదిలేవే! కదిలించదగిన కీలులో ఎముకల అగ్రభాగములు పల్చని కార్టిలేజ్ తో కప్పబడి, నునుపైన ఉపరితల ప్రదేశాన్ని కలిగి వుంటాయి. వెన్నుపూసల మధ్య వుండే కార్టిలేజ్ ముక్కలు షాక్ అబ్సార్బర్స్ లాగా పనిచేస్తాయి. ఎముకలు కలిసే ప్రదేశంలో వాటిని ఫైబ్రస్ టిష్యూతో నిర్మింపబడిన తాళ్ళ వంటి లిగమెంటులు కలిసి వుండేట్లు చేస్తాయి. ఈ పొరపై నోవియల్ ఫ్లూయిడ్ అవే ద్రవపదార్థాన్ని  సృష్టిస్తుంది. అది కందెనలా తోడ్పడుతుంటుంది.


అయితే చాలామందిలో ఉన్న ప్రశ్న.. కీళ్లు ఎందుకు అలా అరిగిపోతాయి?? చిన్న వయసులోనే కీళ్లు అరిగిపోవడం ఏంటి విచిత్రం కాకపోతే.. అనుకుంటూ వుంటారు. 


90°కన్నా ఎక్కువగా మోకాల్ని బెండ్ చెయ్యడం మంచిదికాదు. ఇప్పుడంటే కొన్ని కొత్త ఇళ్లలో టాయిలెట్స్ అన్నీ వెస్ట్రన్ వెర్షన్ వచ్చాయి. కానీ చాలా ఇళ్లలో సాధారణ టాయిలెట్స్ ఉంటాయి. టాయిలెట్ వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద కూర్చుంటూ వుంటాం. ఇలా ఎక్కువగా కూర్చోవటం మంచిదికాదు. మోకాలు కీలుని అంత ఎక్కువగా వంచి కూర్చోవటం వల్ల ఆ కీళ్ళు బాగా అరిగిపోతాయి. ఇలా ఎక్కువగా వాడడం వల్ల ‘జాయింట్స్ ఏజ్' బాగా పెరిగిపోతుంది. మనిషి వయసుతో సంబంధం లేకుండా జాయింట్స్ వయసు పెరిగిపోతుందన్న మాట! కొంతమంది ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఫలానా అతనికి యాభై సంవత్సరాలు దాటినా అరగలేదు, నా కీళ్ళు నలభై అయిదేళ్ళకే అంతగా అరిగిపోయాయేంటి అనుకుంటుంటారు. అయితే ఇక్కడ ముఖ్య విషయం కీళ్ళు వాడకాన్ని బట్టి అరుగుతాయి కానీ వయసుని బట్టి కాదు.


కాబట్టి ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే… కీళ్లు అనేవి వయసును బట్టి కాదు మనం చేసే పనులు, కీళ్లను ఉపయోగించే విధానం మీద ఆధారపడి అరుగుతాయి. 


కీళ్లు బలంగా ఉండటానికి మంచి ఆహారం తీసుకోవాలి. కీళ్ల మీద మరీ ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిలుచుకోవడం, కూర్చోవడం, పరిగెత్తడం, నడవడం, పడుకోవడం ఇలా చేసే ప్రతి పనిలో కీళ్లు సౌకర్యవంతంగా ఉండే భంగిమ చూసుకోవాలి. 


ఆహారం, జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ వీటిని సక్రమంగా ఉంచుకుంటే కీళ్ల ఆరోగ్యం కలుక్కుమనకుండా కులాసాగా ఉంటుంది.


                                  ◆నిశ్శబ్ద.