పిల్లల మెదడు పదునుగా ఉంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే..!


పిల్లలు చాలా తెలివిగా, చురుగ్గా ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ఎందుకంటే ఇలా ఉన్నపిల్లలే చదువులో బాగా రాణిస్తారు.  పిల్లల చిన్నతనం అంతా చదువులు, ర్యాంకులు,  ప్రైజులు,  పుస్తకాల ప్రపంచంలో గడుస్తుంది.  ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు బాగా ఆలోచించాలన్నా,  ఏదైనా సరే తొందరగా నేర్చుకోవాలన్నా, తెలివైన పిల్లలు అనిపించుకోవాలన్నా వారి మెదడు పనితీరు చురుగ్గా ఉండాలి. మందబుద్దిగా ఉన్న పిల్లలు తరగతిలోనే కాదు.. ఇంట్లో కూడా తల్లిదండ్రుల దగ్గర చివాట్లు తింటారు. అయితే పిల్లలు మందబుద్ది స్థాయి నుండి తెలివిగా మారాలంటే వారి మెదడును యాక్టీవ్ చేసే ఆహారాలు ఇవ్వాలి.  పిల్లల మెదడుకు పదును పెట్టే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే..

వాల్నట్స్..

పిల్లల మెదడును పదును పెట్టడానికి వాల్‌నట్స్ అత్యంత ప్రయోజనకరమైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు,  యాంటీఆక్సిడెంట్లు వంటి అంశాలు  మెదడు శక్తిని పెంచుతాయి. వాల్నట్స్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే దాని మీద ఉన్న లేత పొరను తొలగించి తినమని చెప్పాలి. ఇది  చాలా మంచి మార్గం. ఇలా తినడానికి పిల్లలు ఇష్టపడకపోతే డ్రై ఫ్రూట్స్ బార్ లేదా లడ్డు వంటి వాటిలో వాల్నట్స్ ను యాడ్ చేసి రోజుకు ఒకటి ఇస్తుండాలి.

ఆకుకూరలు

పాలకూర, మెంతికూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు  మెదడు ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఐరన్, ఫోలేట్,  విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఈ ఆకుకూరలు  మెదడును బలపరుస్తాయి.  అయితే పిల్లలు పాస్ట్ ఫుడ్స్,  బయటి ఫుడ్స్ ను ఇష్టపడినట్టు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు.  అందుకే  ఆకుకూరలతో సూప్,  కట్లెట్, పనియారం వంటి వాటిలో ఆకుకూరలు జోడించాలి. చపాతీ చేసేటప్పుడు మెంతికూర ఆకులు లేదా పాలకూర పేస్ట్ వేసి పిండిని కలుపుకోవాలి. వంటల్లో ఆకుకూరలను జోడించాలి.

బెర్రీలు

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు,  రాస్ప్బెర్రీస్ వంటి పండ్లు  మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పండ్లు  మెదడును పదునుపెడతాయి. పిల్లలకు ఈ విదేశీ పండ్లంటే చాలా ఇష్టం.  వాళ్లను బ్రతిమలాడకపోయినా తినేస్తారు.  అయితే ఖరీదు కారణంగా వీటిని అవాయిడ్ చేస్తుంటారు. కానీ నేరేడు,  రేగు పళ్లు.. వంటి లోకల్ పండ్లను కూడా పిల్లలకు ఇవ్వచ్చు.  ఇవి కూడా మంచి పోషకాలు కలిగి ఉంటాయి.

గుడ్డు..

గుడ్లు తినడం  ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ఉండే కోలిన్  మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాధారణంగా గుడ్డులోని పచ్చ సొనను పడేస్తుంటారు. కానీ గుడ్డులోని పచ్చసొన కూడా తినాలి.  రోజుకు ఒక గుడ్డు పిల్లలకు ఇస్తూ ఉంటే వారి శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా మెదడు పనితీరు కూడా పెరుగుతుంది.

పైన చెప్పుకున్న నాలుగు ఆహార పదార్థాలను పిల్లల ఆహారంలో తప్పనిసరిగా బాగం చేస్తూ ఉంటే పిల్లలు చాలా చురుగ్గా మారతారు.  వారి మెదడు పనితీరు మెరుగవుతుంది. చదువులో రాణిస్తారు.  అయితే పిల్లలను చదువులో ప్రోత్సహించడం,  వారిని ఇన్ప్రైర్ చేయడం తల్లిదండ్రులు తప్పక చేయాలి.


                                    *రూపశ్రీ

 

గమనిక:


ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...