చక్కెర లేదా నూనె.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ హానికరం అంటే..!
posted on Mar 24, 2025 9:30AM
.webp)
చక్కెర కాఫీలు, టీల తో పాటు స్వీట్లలో కూడా బాగా ఉపయోగించే పదార్థం. ప్రతి ఇంట్లో ఒక డబ్బా నిండుగా చక్కెర ఉండాల్సిందే.. అయితే చక్కెర వ్యాధిగా పిలవబడే డయాబెటిస్ సమస్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఆహారం నుండి చక్కెరను మినహాయించాలని నిర్ణయించుకుంటున్నారు. ఇక నూనె లేకుండా ఏ ఆహారం వండలేం అన్నట్టు ఉంటుంది పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎంత ఆవిరిలో ఉడికించిన వంట అయినా సరే.. కాసింత నూనెతో పోపు వెయ్యకపోతే అసలు తినాలని అనిపించదు. ఇక నూనెలో డీప్ ఫ్రై చేసే ఆహారాలు ఎంత రుచిగా ఉంటాయో తినేవారి దూకుడును బట్టి చెప్పేయవచ్చు. అయితే నూనె కూడా ఆరోగ్యానికి ప్రమాదమే అని అంటున్నారు ఆహార నిపుణులు. ఆహారంలో తప్పనిసరిగా ఉపయోగించే చక్కెర, నూనె రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ హానికరం అనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు, ఆహార నిపుణులు కింది విధంగా విశ్లేషిస్తున్నారు.
వైద్యుల అభిప్రాయం ప్రకారం, చక్కెర, కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం కాలేయానికి ఆల్కహాల్ తాగినంత హానికరం. ఇది కాలేయ పనితీరుకు ప్రమాదకరం. తినే ప్రతిదీ కాలేయం ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. ఇది శరీర గిడ్డంగిగా పనిచేస్తుంది. కేలరీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. ఇది మధుమేహం, ఇతర జీవక్రియ వ్యాధులకు దారితీస్తుంది.
చక్కెర, కొవ్వు అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. దీని ఫలితంగా కాలేయ సమస్యలు, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వంటివి వస్తాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం లేదా అధిక బరువు కలిగి ఉంటారని నివేదికలు చెబుతుండటం ఆందోళన కలిగించే అంశం. దీనివల్ల ఫ్యాటీ లివర్ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది.
జీవితాన్ని ప్రభావితం చేస్తాయా?
చక్కెర చేసే చేటు..
మధుమేహం, కాలేయ వ్యాధి, ఊబకాయానికి ప్రధాన కారణాలలో చక్కెర ఒకటి. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కాలేయం లావుగా మారుతుంది. ఇది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కు దారితీస్తుంది. ఈ పరిస్థితి మరింత దిగజారి కాలేయానికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం ద్వారా ఇన్సులిన్ నిరోధకత అవకాశాన్ని పెంచుతుంది. చక్కెరలో ఖాళీ కేలరీలు ఉండటం వల్ల బరువు పెరగడానికి కారణం అవుతుంది. బరువు పెరగడం ఫలితంగా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఇది మచ్చలు, వాపుకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచడం ద్వారా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
నూనె చేసే చేటు..
ఆరోగ్యానికి హాని కలిగించే మరో ఆహార పదార్థం నూనె. ముఖ్యంగా ప్రాసెస్ చేయబడిన, హైడ్రోజనేటెడ్ నూనెలు. కానీ చక్కెరలా కాకుండా చాలా నూనెలలో కణాల మరమ్మత్తు, మెదడు పనితీరుకు కీలకమైన ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఉపయోగించే నూనె రకం, పరిమాణం చాలా ముఖ్యమైనవి.
నూనె చక్కెర కంటే ఎక్కువ కేలరీలు కలిగి ఉంటుంది కాబట్టి ఒక గ్రాము నూనెలో తొమ్మిది కేలరీలు ఉంటాయి. అదనపు నూనె బరువు పెరగడానికి కారణమవుతుంది. నూనెలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటే గుండె జబ్బులకు కారణం కావచ్చు. నూనెను అధికంగా తీసుకుంటే అది కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఫ్యాటీ లివర్ వ్యాధికి కారణమవుతుంది. మితంగా ఉపయోగించినప్పుడు, ఆవ నూనె లేదా ఆలివ్ నూనె వంటి కొన్ని నూనెలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
ఏది ఎక్కువ హాని..
నూనెను తక్కువ తీసుకోవడం ద్వారా రోజుకు 50 కేలరీలు తగ్గవచ్చు. అయితే, చక్కెర అంత హానికరం కాదు అని అనిపించినా పప్పులో కాలేసినట్టే.. అనుకున్న దానికంటే చక్కెర చాలా ఎక్కువ హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చక్కెరను ఎక్కువగా తీసుకోవడం కూడా అంతే ప్రమాదకరం ఎందుకంటే అది కాలేయంలో కొవ్వుగా మారుతుంది. చక్కెర మరియు నూనె రెండూ ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ, అవి వేర్వేరు పరిణామాలను కలిగి ఉంటాయి. కేలరీల దగ్గర పోలిక కనిపిస్తుంది.
• 1 గ్రాము చక్కెర = 4 కేలరీలు
• 1 గ్రాము నూనె = 9 కేలరీలు
• 5 గ్రాముల నూనె వినియోగం = 45 కేలరీలు
• 2 టీస్పూన్ల చక్కెర 1 టీస్పూన్ నూనెతో సమానం.
కాబట్టి చక్కెర నూనె రెండూ హానికరమే.. ఉపయోగించే పరిమాణం, ఉపయోగించే నాణ్యతను బట్టి కూడా ఈ హానికరంలో తేడాలు ఉండవచ్చు. కానీ తక్కువ వినియోగం ఎప్పటికీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...