అధికవేడి చేస్తోందా?? భయం వద్దు.. ఇలా తగ్గించేయండి.

ఒళ్ళు ముట్టుకుంటే సాధారణంగానే ఉంటుంది కానీ.. ఆ వ్యక్తికి మాత్రం లోపల నిప్పులు కురిసినట్టే ఉంటుంది. గొంతంతా తడి ఆరిపోతూ ఉంటుంది.. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. నోరు పిడచకట్టుకుపోతుంది. పెదవులు ఎండిపోయి నిర్జీవంగా తయారవుతాయి. ఊపిరి వదులుతుంటే వేడిగా సెగలు కొడుతుంది. చర్మం అంతా కళ కోల్పోతుంది. మొత్తానికి మనిషి వాడిపోయిన పువ్వులా తయారవుతాడు. ఇదంతా అధిక వేడి వల్ల కలిగే ఇబ్బంది. ఎదుటివారు మాత్రం నీకేమి కాలేదు ఊరుకో… అని అంటుంటారు. తమను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటున్నారు ఏంటి వీళ్ళు అనే ఒకానొక బాధ మనుషుల్ని పట్టి పీడిస్తుంది. ఇలా శరీర సమస్య కాస్తా మానసిక సమస్యగానూ తయారవుతుంది. వైద్యులను కలసి మందులు వాడితే… వారు ఇచ్చే ఇంగ్లీష్ మందులు కూడా శరీరానికి వేడిని పెంచేవే… మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా?? అని బాధపడేవారు కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికీ కొన్ని చిట్కాలు ఉన్నాయి.. 


వేడి తగ్గడానికి సహజమైన చిట్కాలు..


అందరికీ సులువుగా దొరికేది వేప. దీని రుచి గురించి పక్కన పెట్టి కాస్త ఓపికగా వాడితే మంచి ఫలితం ఉంటుంది.  వేపాకుల రసం 20-50 మి.లీ.  తీసుకోవాలి. అందులోకి 5 నుండి20 గ్రా॥ల పటిక బెల్లము కలపాలి. చేదు ఎక్కువ భరించలేము అన్నవారు పటికబెల్లం ఎక్కువగా అంటే 20 గ్రాముల వరకు. చేదు తీసుకోగలం అనేవారు 5గ్రాములు మోతాదు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక వారము రోజులు తాగడం వల్ల వేడి తగ్గుతుంది.


మామిడి చెట్టు లోపలి బెరడు తీసుకోవాలి, తరువాత అత్తి (మేడి) చెట్టు వేరు బెరడును, ఇంకా మర్రి చిగుళ్ళను తీసుకోవాలి. వీటి నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 10 నుండి 40 మి.లీ. తీసి,  అందులో 1 నుండి 2 గ్రా॥ల జీలకర్ర, 5 నుండి 20 గ్రా॥ల పటిక బెల్లము కలపాలి. ఈ మిశ్రమాన్ని తాగటం వల్ల ఎలాంటి వేడి అయినా తగ్గిపోతుంది.


సోంపు మనందరికీ తెలిసిందే. ఇప్పట్లో హోటళ్లలో తిన్న తరువాత స్వీట్ సొంపు ఇస్తారు మౌత్ ఫ్రెషనర్ గా. ఈ సొంపు, జీలకర్ర, పటిక బెల్లమును మూడింటిని రాత్రి పూట నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే దీన్ని వడపోసి పరగడపున త్రాగాలి. ఇలా చేస్తుంటే  శరీరంలోని వేడి మొత్తం తగ్గిపోతుంది.


అందరికీ అతి సులువుగా ఏ కాలంలో అయినా లభించేది నిమ్మకాయ. ఈ  నిమ్మరసంలో పఠిక బెల్లం వేసి జ్యుస్ లాగా తయారుచేసుకోవాలి. దీన్ని తాగుతుంటే కూడా అధికవేడి దెబ్బకు తగ్గిపోతుంది. 

అధికవేడి సమస్య అన్ని కాలాలలో ఉన్నా వేసవికాలంలో ఎక్కువగా వేధిస్తుంది. ఈ వేసవి కాలంలో అందరికీ దొరికే అద్భుతమైన ఫలం పండ్లకు రారాజు మామిడి. ఈ మామిడి పండు పచ్చిగా ఉన్నది తీసుకోవాలి. దాన్ని తోలు తీసి నీటిలో మరిగించాలి. తర్వాత దాని గుజ్జును చల్లని నీటిలో పిసికి రసము తీసి నచ్చినట్టుగా అందులో  ఉప్పు, జీలకర్ర, చెక్కెర మొదలయినవి కలిపి తాగాలి. దీనిని ప్రస్తుతం చాలామంది ఆమ్ పన్నా అని పిలుస్తుంటారు. పచ్చిమామిడితో చేసే ఈ జ్యుస్ అధికవేడి సమస్యకు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా వడదెబ్బ సమస్య రాకుండా వేసవిలో ఈ జ్యుస్ ను తీసుకుంటూ ఉంటారు.  


చెరకు రసం అద్భుతమైన ఔషధం. ఒకప్పుడు చెరకును నేరుగా తినేవారు. ప్రస్తుత కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది అరుదైపోయింది. అయితే అక్కడక్కడా చెరకు రసం అమ్ముతూ ఉంటారు. ఈ చెరకు రసాన్ని రోజూ తీసుకుంటూ ఉంటే అధికవేడి సమస్య క్రమంగా తగ్గిపోతుంది. అలాగే కడుపులో మంట లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. 


దానిమ్మపండ్లు అన్నిచోట్లా లభ్యమవుతాయి. ఈ దానిమ్మ పండు రసం తీసినా.. లేదా నేరుగా అలాగే విత్తనాలు తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో తలనొప్పి వచ్చినా, వడదెబ్బ తగిలినా, కళ్ళు ఎరుపెక్కినా, దానిమ్మ పండు రసం తాగితే ఫలితం ఉంటుంది. 


ఇలా సహజమైన చిట్కాలు ఉపయోగించి శరీరాన్ని మండించే అధికవేడిని తరిమేయచ్చు..
 

 ◆నిశ్శబ్ద.