జయ... రజినీతో ఆ సినిమా ఎందుకు చేయనంది?


తమిళులు అమ్మ జయలలితని గౌరవంగా పురుచ్చి తలైవీ అంటారు! అయితే, ఆమెను తలైవీ అన్న జనం తలైవా అని ఎవర్ని అన్నారో తెలుసుగా? నన్ అదర్ ద్యాన్ సూపర్ స్టార్ రజినీకాంత్! ఆశ్చర్యకరంగా... ఈ తలైవా, తలైవీ ఇద్దరూ కర్ణాటకలోనే పుట్టారు. కాని, తమిళ సినిమా రంగాన్ని ఏలారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా ఇంకా కోలీవుడ్ ని శాసిస్తూనే వున్నాడు. కాని, జయ మాత్రం గ్లామర్ ప్రపంచం మీదుగా రాజకీయ రణరంగంలోకి వచ్చి అమ్మగా అవతరించి... తన మహా ప్రస్థానం పూర్తి చేసేసింది! కాని, ఇక్కడే రజినీ, జయలలితలకు సంబంధించిన ఒక హిస్టారికల్ ట్విస్ట్ వుంది!


రజినీకాంత్, జయలలిత కలిసి నటించిన సినిమా ఒక్కటి కూడా లేదు. హీరో, హీరోయిన్స్ గా కాదు వేరు వేరు పాత్రల్లో కూడా వాళ్లు నటించిన కామన్ మూవీ అంటూ లేదు. కాని, చరిత్రలోకి తొంగి చూస్తే ఈ ఇద్దరు లెజెండ్స్ ఒక బ్లాక్ బస్టర్ మూవీ చేయాల్సింది. కాని, దురదృష్టవశాత్తూ అది వర్కవుట్ కాలేదు. ఈ విషయం ఇప్పుడు తెలియటానికి కారణం... జయ రాసిన 36ఏళ్ల నాటి ఒక లెటర్! 


జయలలిత 1980 కాలంలో  సినిమాలు చేయలేదు. 82లో రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అయితే, అప్పట్లోనే ఖాస్ బాత్ అనే పత్రిక ఒక వ్యాసం అచ్చేసింది. అందులో ఆమెకు మంచి ఆఫర్స్ తగ్గాయిపోయాయని, అందుకే సినిమాలు చేయటం లేదని అబిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన జయ ఎడిటర్ కి లెటర్ రాశారు. అందులో ఆమె ప్రత్యేకంగా 1980లోనే విడులైన సూపర్ హిట్ మూవీ బిల్లా గురించి డిస్కస్ చేసింది. ఆ సినిమా రజినీ హీరోగా జనం ముందుకొచ్చి కోలీవుడ్ ని ఊపేసింది! అటువంటి క్రేజీ ప్రాజెక్ట్ లో తనని హీరోయిన్ గా ఆ సినిమా దర్శకుడు బాలాజీ అడిగారని, తాను కాదన్నాకే శ్రీప్రియని హీరోయిన్ గా తీసుకున్నారని వివరించింది. అంతే కాదు, అమ్మ తనదైన స్టైల్లో ఆత్మ విశ్వాసం ఉట్టిపడేలా... ఆఫర్లు లేవన్నది ఒట్టి మాటని తీవ్రంగా ఖండించింది!


జయలలిత కన్నుమూశాక బయటకొచ్చిన ఆమె లెటర్ రజినీకాంత్ తో చేయలేకపోయిన సినిమా గురించి ప్రపంచానికి తెలియజేసింది. ఒకవేళ  ఆ రోజు జయ బిల్లా సినిమాకి సై అని వుంటే మనకు మరో అద్భుతమైన కమర్షియల్ ఎంటర్టైనర్ లభించి వుండేది!         

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu