వీధిలో అడుక్కునే అమ్మాయి విధి రాత మార్చేసింది!
posted on Dec 7, 2016 1:21PM

అడగందే అమ్మైనా పెట్టందంటారు! కాని, అడగకున్నా పెట్టే అమ్మ ... మా జయమ్మ అంటారు తమిళులు! జయలలితపై వాళ్ల అభిమానం మనకు తెలియంది కాదు. కాని, అంతటి అభిమానం పొందటం ఒక రాజకీయ నేతకు ఎలా సాధ్యమైంది? ఊరికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ టీవీలు, మిక్సీల వల్ల వీలైందా? జయ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలానే ఉపయోగపడవచ్చు , కాని, అసలు కారణం వేరే వుంది. అదేంటో తెలియాలంటే, ముందు మనం తమిళనాడు వదిలి కర్ణాటకలోని మైసూర్ కు వెళ్లాలి...
జయలలిత పుట్టింది మైసూర్ ప్రాంతంలో అయినా ఆమె తమిళురాలు. తమిళనాడులోనే అత్యధిక భాగం తన జీవితం గడిచింది. ఆ మైసూరులోనే ఒక అమ్మాయి వీధుల్లో అడుక్కుంటూ వుండేది చాన్నాళ్ల క్రితం! ఇప్పుడామె ఏం చేస్తోందా తెలుసా? లాయర్ గా కోర్టులో కేసులు వాదిస్తోంది! వినటానికే ఆశ్చర్యంగా వుంది కదా... ఒక భిక్షమెత్తుకునే అమ్మాయి లాయర్ అయిందంటే! అందుక్కారణం అమ్మ జయలలితే...
జయ సీఎంగా వున్నప్పుడు నాగరత్న అనే ఒక తెలివైన కన్నడ విద్యార్థిని గురించి పేపర్లో పడింది. టెన్త్ లో ఆమెకు 65శాతం మార్కులు వచ్చాయి. కాని, అసలు విషాదకరమైన విశేషం ఏంటంటే... నాగరత్న చదువు మీద ఇష్టంతో పదో తరగతి పాసైనా వాళ్ల కుటుంబం అప్పట్లో వీధుల్లో అడుక్కునేది. ఎలాగో టెన్త్ వరకూ నెట్టుకొచ్చిన ఆ అమ్మాయి తరువాత చదువుకునే వీలు లేకుండా పోయింది. కాని, అప్పుడే అదృష్టం అమ్మ రూపంలో ఆమెను వెదుక్కుంటూ వచ్చింది! జయ ఆ అభాగ్యురాలి గురించి న్యూస్ పేపర్లో చూసిన వెంటనే కర్ణాటకలోని తమ పార్టీ నాయకుడిని పురమాయించింది. తరువాత అతను నాగరత్నను తీసుకుని జయలలిత వద్దకు రావటం, ఆమె లక్ష రూపాయల చెక్కు అప్పటికప్పుడు అందజేయటం, ముందు ముందు అయ్యే ఖర్చులు కూడా భరిస్తానని భరోసా ఇవ్వటం చకచకా జరిగిపోయాయి!
ఆ రోజు పదో తరగతి పాసైనా కూడా భిక్షమెత్తుకుని బతికే స్థితిలో వున్న మైసూర్ లోని నాగరత్నే ఇప్పుడు సక్సెస్ ఫుల్ లాయర్ గా కొనసాగుతోంది. అదంతా అమ్మ... పురుచ్చి తలైవీ భిక్షేనంటుంది ఆమె! నిజమే కదా... ఇలాంటి మంచి మనస్సు, వెంటనే ఆదుకునే గుణం వున్నాయి కాబట్టే జయ దిగ్విజయంగా తమిళనాడు మొత్తాన్నీ తన అభిమానులుగా మార్చేసుకోగలిగింది!