జయమ్మా... నీకు తిరుగే లేదు...
posted on May 11, 2015 12:15AM
అమ్మా జయలలితమ్మా... జాతకమంటే నీదేనమ్మా... సినిమా రంగంలో నీకు ఎలాగూ తిరుగులేకుండా హవా నడిపించావు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా నువ్వు హవా నడిపిస్తున్నావమ్మా. నిన్ను మొట్టమొదట ‘పురచ్చితలైవి’ (విప్లవ నాయకి) అన్నవాడెవడో గాని వాడికి వందనాలమ్మా. ఎంజీఆర్ తర్వాత ఎవరా అని అనుకుంటున్న సమయంలో కొంతకాలం అన్నా డీఎంకేకి దూరంగా వున్నప్పటికీ ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టావు. తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్, కరుణానిధి తర్వాత ఆ స్థాయిని పొందావు. తమిళనాడు అసెంబ్లీలో అవమానానికి గురైనా ఎంతమాత్రం అదరకుండా బెదరకుండా నీ లక్ష్యం వైపు దూసుకెళ్ళావు. రాజకీయాల్లో కాకలు తీరిన కరుణానిధి లాంటి యోధుడినే మట్టి కరిపించి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఫిక్సయిపోయావు. నీమీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా వాటిని ఎంతమాత్రం పట్టించుకోకుండా విజయపథంలో నడుస్తున్నావు. ప్రజల్ని ఆకట్టుకోవాలంటే నీ తర్వాతే ఎవరైనా. ప్రజలకు గిఫ్టులిస్తావు.. ముఖ్యమంత్రి పదవిని గిఫ్టుగా పొందుతూ వుంటావు. ఒకప్పుడు దేశ రాజకీయాలనే శాశించిన మహిళా శక్తివి నీవమ్మా. వాజ్‌పాయ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన శక్తి స్వరూపిణి నీవమ్మా. అక్రమాస్తుల కేసులో మొన్నామధ్య నీకు శిక్ష పడినప్పుడు నువ్వు ఎమ్మెల్యే పదవిని, ముఖ్యమంత్రి పదవిని వదులకున్నావు. అప్పుడు అందరూ నీ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ బూడిదలోంచి పైకి లేచే ఫినీక్స్ పక్షి తరహాలోనే ఎంత గొప్పగా ఆ కేసులోంచి పడ్డావో చూశాక నీకు నువ్వే సాటి అని, ఇక నీకు తిరిగేలేదని అర్థమైపోయిందమ్మా. మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న నీకు అభినందనలు జయమ్మా.