ఉద్యమిస్తే ఉరికించి కొడతారు
posted on May 11, 2015 12:19AM
తెలంగాణ రాష్ట్రంలో ఈమధ్యకాలంలో ఉద్యమాల గొడవ ఎక్కువైపోయింది. ఉద్యమాల కారణంగానే తెలంగాణ వచ్చింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమాలేంటి? అందుకే భవిష్యత్తులో తెలంగాణలో ఉద్యమాల ఊసే లేకుండా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యమాల ఊసెత్తిన వాళ్ళని ఉరికించి కొట్టడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇటీవలి కాలంలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు... ఇలా అన్ని వర్గాల వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ధర్నాలు, ర్యాలీలు, నినాదాలతో రాష్ట్రాన్ని హోరెత్తిస్తున్నారు. ఇది సహజంగానే ప్రభుత్వానికి చిరాకు తెప్పిస్తున్నాయి. అందుకే ఇలాంటి ఉద్యమాలను అణిచేసే మార్గంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈమధ్య తెలంగాణ రాష్ట్రానికి నాలుగు ఇండియన్ రిజర్వ్ పోలీసు బెటాలియన్లను కేంద్రం కేటాయించింది.ఈ నాలుగు బెటాలియన్ల సేవలను పది జిల్లాల్లో ఉద్యమం పేరుతో నిరసన కార్యక్రమాలను చేపట్టేవారిని అదుపు చేయడానికి వినియోగించనున్నట్టు తెలుస్తోంది. ఎవరు ఎలాంటి ఉద్యమం చేసినా వారిని అణచివేయడానికి పోలీసు యంత్రాంగానికి ఫుల్ పవర్స్ ఇవ్వాలని నిర్ణయించారట. అలాగే పోలీసులకు ఆధునిక ఆయుధాలు, లాఠీలు, వైర్‌లెస్ సెట్లు, వాహనాలను అందించాలని కూడా నిర్ణయించారట. అంటే ఇకమీద ఉద్యమాలు చేస్తూ రోడ్డు మీదకి ఎక్కేవారిని పోలీసులు ఉరికించి కొట్టడం ఖాయమన్నమాట. అంచేత ఉద్యమకారులూ... జర సోచాయించుకోండి.