కిరణ్‌రెడ్డిది హత్యే

హైదరాబాద్: కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మేనకోడలు కిరణ్‌రెడ్డి హత్యకు గురైనట్లు పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు సమాచారం. ఊపిరాడకపోవటం వల్లే ఆమె మరణించారని ఆరుగురు సభ్యుల వైద్యుల బృందం తమ ప్రాధమిక నివేదికల్లో పేర్కొన్నారు. ఆమె తలకు బలమై గాయం కూడా ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. పోస్టుమార్టం నివేదికను బట్టి చూస్తే కిరణ్‌రెడ్డి భర్తే హంతకుడని తెలుస్తోంది.కాగా ఈరోజు సాయంత్రానికల్లా పోస్ట్‌మార్టం నివేదిక పోలీసులకు చేరనుంది.

కిరణ్‌రెడ్డి మరణించిన విషయం విదితమే. మొదట కుటుంబ సభ్యులు, పోలీసులు కూడా ఆమెది సహజ మరణంగానే భావించారు. పోలీసులు సైతం అలాగే కేసు నమోదు చేశారు. ఇదిలాఉంటే ఆదివారం కిరణ్‌రెడ్డి తండ్రి రఘోత్తంరెడ్డి తన కుమార్తె మృతికి అల్లుడు చైతన్యరెడ్డి కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు శారు. పోలీసులు రంగంలోకి దిగి ఆ దిశగా కేసు దర్యాప్తు చేశారు. ఈ నెల 17న కిరణ్‌రెడ్డి తన సోదరుడు సునీల్‌రెడ్డి వివాహ నిశ్చితార్థం సందర్భంగా బ్యాచిలర్‌ పార్టీకి భర్త చైతన్యరెడ్డితో కలిసి వెళ్లారు. అక్కడి నుంచి అర్ధరాత్రి దాటాక ఇంటికి చేరుకున్నారు. క్షేమంగా చేరుకున్నట్లు తన సోదరుడికి కిరణ్‌రెడ్డి ఫోను చేసి చెప్పారు. శనివారం (18న) ఉదయం చైతన్యరెడ్డి రఘోత్తంరెడ్డికి ఫోను చేసి కిరణ్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అక్కడ కిరణ్‌ని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ హత్యపై  అనుమానంగా ఉందంటూ రఘోత్తంరెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సెక్షన్‌ 302 కింద హత్య కేసు నమోదు చేశారు. చైతన్యరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.