వైపీఎస్ లు, అయ్యాఎస్ లకు ఇక గడ్డుకాలమే!

జగన్‌ హయాంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ గూండాలకు, వారికి సహకరించిన ‘వైపీఎస్‌’ అధికారులకు,అయ్యాఎస్ అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తాము చేసిన తప్పిదాలకు రాజ్యాంగ ఉల్లంఘనలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అటువంటి అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ నేతల తప్పులకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించి చర్యలు తీసుకునే దిశగా సీఎం చంద్రబాబు పోలీసులను నడిపిస్తున్నారు. ఫలితంగా వైసీపీ జమానాలో అడ్డగోలుగా రెచ్చిపోయి, ఇష్టారీతిగా వ్యవహరించిన వారిలో ఆందోళన, భయం వ్యక్తం అవుతున్నాయి. అలాగే వైసీపీ నేతలకు వంత పాడిన ఐపీఎస్ లు పోస్టింగుకు కూడా నోచుకోకుండా ఎప్పుడేం జరుగుతుందా అన్న భయంతో వణికి పోతున్నారు. 
వైసీపీ ప్రభుత్వంలో అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును రాత్రికి రాత్రి హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి సీఐడీ కార్యాలయంలో చిత్రహింసలకు గురిచేశారు. ఈ వ్యవహారంలో తనను వేధించి, హింసించిన ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌, వ్యూహరచన చేసిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, అమలు చేసిన అడిషనల్‌ ఎస్పీ విజయ్‌పాల్‌పై గుంటూరు ఎస్పీకి రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ముగ్గురిపై కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు హత్యాయత్నం సెక్షన్లు పెట్టారు.

అయితే నిందితులు సీనియర్‌ ఐపీఎ్‌సలు కావడం, అదనపు ఎస్పీ స్థాయిలో పనిచేసిన విజయ్‌పాల్‌ దర్యాప్తు అధికారికి సహకరించక పోవడంతో కేసు నీరుగారి పోతోందన్న భావన వ్యక్తమైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించి కేసు దర్యాప్తు బాధ్యతలను ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న దామోదర్‌కు అప్పగించింది. దీంతో విజయ్‌పాల్‌ నోరు విప్పక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. పాల్‌ నోరు విప్పితే ఎవరెవరు కుట్ర చేశారు? ఎవరు అమలు చేశారు? తదితర విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి.