ప్రపంచ దేశాలతో ఏపీ పోటీ.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో    నారా లోకేష్ అత్యంత కీలకంగా మారారు. తండ్రిని మించిన తనయుడిగా పార్టీ సీనియర్లు సైతం ఆయనను ప్రస్తుతిస్తున్నారు. ఇదే లోకేష్ పాదయాత్రకు ముందు ప్రత్యర్థుల ట్రోలింగ్ కు కేంద్రంగా ఉండేవారు. లోకేష్ అడుగేస్తే ట్రోల్, మాట్లాడితే ట్రోల్, మౌనంగా ఉంటే ట్రోల్ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. అయితు ఆయన యువగళం పాదయాత్రతో ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. లోకేష్ ను విమర్శించాలంటే ప్రత్యర్థులు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తోంది. లోకేష్ యువగళం పాదయాత్రతో  పొలిటికల్ గా పరిణితి చెందిన నేతగా మేకోవర్ అయ్యారు. జగన్ సర్కార్ వైఫల్యాలనూ, ఆయన హయాంలో అనుసరించిన కక్ష పూరిత వైఖరిని పాదయాత్రలోనే కాదు ఇప్పుడు మంత్రిగా కూడా గట్టిగా ఎండగడుతున్నారు.  
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పనలో క్రియాశీలంగా, కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన మాట సూటిగా ఉంటుంది. ఎలాంటి సుత్తీ లేకుండా నేరుగా చెప్పదలచుకున్నది చెబుతారు. చేయదలచుకున్నది చేస్తారు. మాట ఇస్తే తిరుగుండదన్ననమ్మకాన్ని ఆయన ప్రజాబాహుల్యంలో కలిగించారు. 
అయితే నారా లోకేష్ ఈ స్థాయికి ఎదగగలిగారంటే అందుకు ఆయన చేసిన కఠోర శ్రమ, సెల్ఫ్ డిసిప్లిన్ కారణం. రాజకీయంగా తొలి అడుగు వేయకుండానే, తండ్రి చాటు బిడ్డగా ఉన్న సమయంలోనే ప్రత్యర్థులు ఆయనను టార్గెట్ చేశారు. వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఆయన ఆహార్యాన్ని, భాషను, యాసను గేలి చేశారు. బాడీ షేమింగ్ చేశారు. ఆయన ఆహారపు అలవాట్లపై సెటైర్లు గుప్పించారు. ఇది, అది అని కాదు పరిధులు దాటి తూలనాడారు. అయితే స్థిత ప్రజ్ణతతో లోకేష్ వారి విమర్శలకూ, ఎగతాళికి, హేళనకు తన పని తీరుతోనే సమాధానం చెప్పారు.  ముందుగా తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలు పెట్టిన లోకేష్.. తనతు తాను పూర్తిగా మేకోవర్ చేసుకున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ఒకరిగా ఎదిగారు. 

అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ప్రత్యర్థులు సైతం ఔరా అనేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి అని యువతకు పిలుపు నిచ్చారు. లోకేష్ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల సరసన నిలపాలన్న కలను సాకారం చేసుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అనే వారు. ఇప్పుడాయన నినాదం థింక్ గ్లోబల్లీ యాక్ట్ గ్లోబల్లీగా మారింది. అందుకు తగ్గట్టుగానే లోకేష్ దేశంలోని రాష్ట్రాలతో కాదు.. ఆంధ్రప్రదేశ్ పోటీ ప్రపంచ దేశాలతో అని చాటుతున్నారు. 

ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కే ప్రపంచ దేశాలతో  పోటీపడుతున్నామని ఉద్ఘాటిస్తున్నారు.  ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రతినిధులతో మంత్రి లోకేష్ న్యూడిల్లీలో సోమవారం(అక్టోబర్ 21)  సమావేశమయ్యారు.  ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి చేపడుతున్న చర్యలు, రాష్ట్రంలో నెలకొన్నఅనుకూలతలపై పరిశ్రమదారులకు మంత్రి లోకేష్ వివరించారు.  దేశంలో పేరెన్నిగన్న పరిశ్రమదారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేశామని, తరచూ వారితో సమావేశమై   విధానపరమైన సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు సాధించడంలో ఐటి, ఎలక్ట్రానిక్ రంగాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఆ పరిశ్రమల కోసం  టైలర్ మేడ్ పాలసీలను రూపొందిస్తామని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే అత్యంత సులభతరమైన ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలను అమలు చేస్తోంది, అన్నిరకాల పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టమ్ ఏర్పాటుచేస్తున్నాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బజినెస్ అనే నినాదంతో  ముందుకు సాగుతున్నామని లోకేష్ చెప్పారు. 4వసారి ముఖ్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల నాయకత్వంలో అభివృద్ధి దిశగా ఏపీ వేగంగా ముందుకు సాగుతోంది. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతుల కోసం ఈడీబీని పునరుద్ధరించాం, సరైన ప్రాతిపాదనలతో వచ్చేవారికి తగిన ప్రోత్సాహకాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పవర్‌హౌస్‌గా మార్చడంపై దృష్టి సారించాం. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఐటి పవర్ హౌస్ గా, అంతర్జాతీయ ఎఐ రాజధానిగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి ఎఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ, డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లోకేష్‌ తెలిపారు.