తెలంగాణలో మూడు రోజుల పాటు వానలే వానలు

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. అక్టోబర్ 3వ వారంలో కూడా భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లా ముంపునకు గురైంది. పండమేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో కాలనీలకు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ముంపు బాధితులు కట్టుబట్టలతో బతుకు జీవుడా అంటూ ఇళ్ల నుంచి బయట పడ్డారు. అనంతపురం, బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది.

మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా తెలంగాణకు కూడా మంగళ వారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాల ముప్పు ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆ  జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.