నారీ నారీ నడుమ జగన్మోహనుడు

 

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది. ఇంట గెలవలేని జయప్రద, సమాజ్ వాది పార్టీ తరపున పోటీ చేసి తనకు బొత్తిగా పరిచయమేలేని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయి రచ్చ గెలిచింది. అయితే, అక్కడ ఈ మద్యనే పరిస్థితులు వికటించడంతో, మళ్ళీ మూటా ముల్లె సర్దుకొని రాష్ట్రానికి వచ్చేయడానికి నిర్నయించుకొన్నట్లు గత కొంత కాలంగా ప్రకటిస్తూన్నాకూడా, మన రాజకీయ పార్టీల నుండి ఆమెకు కనీస స్పందన కరువయింది. ఇక ఇలాగయితే లాభం లేదనుకొన్నఆమె తానే స్వయంగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని తన రాజకీయ జీవితంలో ‘మరో ప్రస్తానం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది.

 

తెలుగుదేశం పార్టీకి ఎన్ని సిగ్నల్స్ పంపినా స్పందించకపోవడంతో, ఇటీవలే పత్రికలవారితో మాట్లాడుతూ ఇక్కడా అక్కడ సైకిలు పార్టీలు తనవంటి సినిమా తారలను పులిహోరలో కరివేపాకులా వాడుకొని వదిలేసాయని అటువంటి పార్టీలకు తానూ దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ప్రకటించేసి తెలుగుదేశం పార్టీతో డిల్లీ నుండే తెగతెంపులు చేసేసుకొంది.

 

అయితే, ఇక మిగిలినవి తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణా సమస్యతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి కాంగ్రెస్ ను నమ్ముకొంటే తనకీ అదేగతి పడుతుందని భావించిన ఆమె, రాష్ట్రంలో ప్రజాదారణ ఉన్న పార్టీలోనే తానూ జేరాలనుకొంటునట్లు ప్రకటించేసింది. అంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతం అందించినట్లే భావించవచ్చును. అక్కడ అయితే వయ్యారి గడుసు రోజమ్మ తనకు తోడుగా ఉంటుందని ఆమె భావించినా, ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయలేదా అనేది ఆమె ఆలోచించినట్లు లేదు. ఆమె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక అప్పుడు 'నారీ నారీ నడుమ జగన్మోహనుడు' అని టైటిల్ వేసేసుకోవచ్చును. త్వరలో ఆమె చంచల్ గూడా జైలు నుండి తన రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం జయప్రదంగా మొదలుపెట్టవచ్చునని సమాచారం.