ప్రకృతి విసిరే ఛాలెంజ్‌లకు మన దేశం సిద్ధమా?
posted on Mar 28, 2020 2:15PM
సృష్టిలో కరోనా మొదటిది కాదు! చివరిది కూడా కాదు! మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతున్నాడు. అనేక దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. శాస్త్రవిజ్ఞానం పెరుగు తున్నకొద్దీ అంటువ్యాధులు ఒక మహమ్మారిలాగా విజృంభిస్తూనే ఉన్నాయి.
కలరా, ప్లేగు, మశూచి, ఫ్లూ (ఇన్‌ఫ్లూయంజా) వంటి వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని బలితీసుకున్నాయి. కరోనా కన్నా ముందు తలెత్తిన ఎబోలా వైరస్ వేలాదిమంది ప్రాణాలను బలిగొన్నది. అది ప్రస్తుతం దక్షిణాఫ్రికాకే పరిమితమై ఉంది. హెచ్‌ఐవి/ఎయిడ్స్ వ్యాధి కారణంగా (2005-2012) 36 మిలియన్ల మంది మరణించగా, ఫ్లూ వల్ల (1968లో) 1 మిలియన్, ఆసియా ఫ్లూ (1956-1958) వల్ల 2 మిలియన్లు మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 27,350 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 6 లక్షలకు చేరుకుంది.
ఇంకా గుర్తించని వేలాది బ్యాక్టీరియాలు, వైరస్‌లు మానవ మనుగడకు ఛాలెంజ్ చేస్తున్నాయి! గతంలో వీటి ప్రభావంతో ప్రజలతో పాటు పెద్దపెద్ద జంతువులు కూడా బలైనాయి, బలవుతూనే ఉంటున్నాయి. ఇదో ప్రకృతి నియంత్రణ. ఓ జీవి (చిన్నదా, పెద్దదా అనేది కాకుండా) మరో జీవిని అనుభవించడం, ఆశ్రయం పొందడం, మనుగడ సాగించడం సృష్టికార్యాలే! ఇవన్నీ అనివార్యమైన చర్యలు.
ఇలా జరగడానికి వీలులేదని భావిస్తే మానవుడు తినే ఆహారం అసలు జీర్ణమేకాదు. అందుకే ఉపయోగకర బ్యాక్టీరియాగా, అపకారి బ్యాక్టీరియాగా గుర్తించడం జరిగింది. నిజానికి అపకారి అనేది మానవుడు పెట్టుకున్న పేరు. ఏ జీవి అయినా, ఏదో రూపంలో, ఏదో విధంగా ప్రకృతికి దోహదపడుతూనే వుంటుంది. మనిషికి ఇబ్బంది కల్గించే వాటన్నింటిని నష్టజాతకులుగా, క్రూర మృగాలుగా అభివర్ణించడం జరిగింది. ఈ దృష్టితో చూసినప్పుడు మాత్రమే కరోనా ఉనికిని అర్థం చేసుకోగలం. ఈ సృష్టిలో ఇది మొదటిది కాదు, చివరిది కూడా కాదు.
నేడు దీనికి నివారణనో, టీకానో, గుర్తించినా, కొంత ఉపశమనమే గానీ, శాశ్వత పరిష్కారం కాదు…కానరాదు. మశూచి, పొంగు, కోరింత దగ్గు, పోలియో, టెటనస్, టిబి తదితర వ్యాధులు ఒకప్పుడు కరోనాలా ప్రపంచాన్ని భయపెట్టినవే!
ఇప్పుడు కరోనా విషయంలో కూడా ఇదే జరుగుతున్నది. ఏదో విధంగా దీన్ని నియంత్రిస్తారు. అంతమాత్రాన ప్రపంచ ప్రజలంతా చీకుచింతా లేకుండా, రోగాలు నొప్పులు లేకుండా వుంటారనుకోవడం ఓ భ్రమనే! మరో కొత్త విపత్తు, సమస్య ముందుకు వస్తుంది.
వీటిని గుర్తించడం శాస్త్రీయంగానే జరుగుతుంది. ప్రజలు శాస్త్రీయంగా ఆలోచించాలి. మన దేశంలో రీసర్చ్‌కు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇస్తున్నారా? విద్యాలయాల్లో సైన్స్ ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. విద్య రంగంలో, సైంటిఫిక్ రంగంలో ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై గుండె మీద చెయ్యి పెట్టుకొని సమీక్షించుకోకపోతే రాబోయే తరాలకు భవిష్యత్ ప్రశ్నార్థకమే!