లాక్‌డౌన్‌నైనా పాటించాలి.. లాకప్‌లోనైనా ఉండాలి: ఐజీ ప్రభాకర్‌రావు

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసు సిబ్బంది పని తీరును నేడు గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు పరిశీలించారు. శంకర్ విలాస్ సెంటర్‌లో సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తోందన్నారు.
ఇప్పటికి 1300 కేసులు నమోదు చేశామన్నారు. గుంటూరులో రెండు పాజిటివ్ కేసులు వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్‌కు పంపామన్నారు.రెండు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ను అయినా పాటించాలి.. లేదంటే లాకప్‌లో నైనా ఉండాలని ఐజీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. తప్పని సరిగా లాక్‌డౌన్ అందరూ పాటించాలన్నారు. అలాగే  ఆంధ్ర - తెలంగాణ బోర్డర్‌లో బందోబస్తు పెంచామని ఐజీ ప్రభాకర్‌రావు తెలిపారు.