ఆంధ్రాలో పప్పులుడకట్లేదు.. జ‌గ‌న్ రాజ‌గురువు ప్యాక‌ప్..!

వైసీపీ  హయాంలోఐదేళ్లూ ఆడిందే ఆట‌.. పాడిందే పాట అన్న‌ట్లుగా ఆయ‌న‌ హ‌వా సాగింది.  కోరిందే త‌డువుగా సీఎం  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నీ చ‌క‌చ‌కా చ‌క్క‌బెట్టేసేవారు. ప్ర‌భుత్వ భూముల‌ను సైతం నామమాత్రపు ధరకు క‌ట్ట‌బెట్టేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలోనూ ఆయ‌న హ‌వాకు అడ్డులేకుండా పోయింది. కానీ, ఇప్పుడు అత‌గానికి ఆంధ్రప్ర‌దేశ్ న‌చ్చ‌టం లేద‌ు. ఎందుకో తెలుసా..? ఆంధ్రాలో ఇక తన పప్పులు ఉడకవు కాబట్టి.  ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రా అని ఆలోచిస్తున్నారా..?  అక్కడికే వస్తున్నా.. వైసీపీ అధినేత  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి రాజ‌గురువుగా, ఇంకా క్లియర్ గా  చెప్పాలంటే గుగ్గురువుగా చెప్ప‌బ‌డే విశాఖ‌ శార‌దా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర.  తెలంగాణ   కేసీఆర్, ఏపీలో జగన్ మోహ‌న్ రెడ్డి  అధికారంలో ఉన్న సమయంలో  ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ స్వరూపానందేంద్రకు అధిక ప్రాధాన్యత ఉండేది. ఈ ఇద్దరు మాజీ సీఎంలూ స్వామి స్వరూపానందేంద్ర పట్ల అత్యంత భక్తి విశ్వాసాలు ప్రదర్శించే వారు  స్వామీజీ ఇద్దరితోనూ రాజ శ్యామల యాగం చేయించారు. ఇద్దరూ విశాఖలోని శారదా పీఠం సందర్శించారు. అయితే, జగన్ మోహ‌న్ రెడ్డి మాత్రం శార‌దా పీఠానికి  ద‌త్త‌పుత్రుడిగా   వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌భుత్వ భూములను త‌క్కువ ధ‌ర‌కు క‌ట్ట‌బెట్ట‌డం ద‌గ్గ‌ర నుంచి.. స్వామిజీ ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసేవారు. దీంతో దేశంలో హిందువుల‌కు నేనే పెద్ద‌దిక్కు అన్న‌ట్లుగా స్వామి స్వరూపానందేంద్ర ప్ర‌వ‌ర్తించార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.  

సాధార‌ణంగా కంచి, శృంగేరి పీఠాధిపతులు ఎప్పుడైనా రాష్ట్రానికి వస్తే అతిథిగా భావించి భద్రత కల్పిస్తారు. కానీ, జగన్ రాజ‌గురువుగా పేరున్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఎక్కడికి వెళ్లినా ఎస్కార్ట్‌ వాహనాలు, వై-కేటగిరీలో   భద్రతా సిబ్బంది ఉండేలా జగన్ ఆయనకు ఎక్కడ లేని ప్రాధాన్యతా ఇచ్చారు.  దానికి కారణం 2019లో జగన్‌ సీఎం కావాలని ఆయన రాజశ్యామల యాగం చేయడమే. దానికి గురుదక్షిణగా ప్రజాధనంతో శారదా పీఠానికి భద్రత కల్పించారు జగన్‌ మోహన్ రెడ్డి. స్వరూపానందేంద్రకు వై-కేటగిరీలో  భద్రత కేటాయించారు. ఆశ్రమానికి ఉన్న రెండుగేట్ల వద్ద ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లను విధుల్లో ఉండేవారు. ఎస్కార్ట్‌ వాహనంలో ఏఎస్సై, ఒక కానిస్టేబుల్ ఉండేవారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర  సరస్వతికి సైతం 2+2 భద్రతా సిబ్బంది, మరో ఎస్కార్ట్‌ వాహనం కేటాయించింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఎస్కార్ట్‌ వాహనాలకు ఇంధన ఖర్చునూ పోలీసు శాఖ‌ే భ‌రించేది. మొత్తంగా 20 నుంచి 25మంది వరకూ భద్రతా సిబ్బంది శారదాపీఠం, స్వరూపానందేంద్ర సువల్లో మునిగి తేలేవారు.   కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల‌కే వై-క్యాటగిరీ భద్రతను నిలిపివేసింది. వారికి వ‌న్ ప్ల‌స్ వ‌న్ పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతోంది.

తాజాగా స్వ‌రూపానందేంద్ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న ఎక్స్ క్యాట‌రిగీ భ‌ద్ర‌త‌ను కూడా ఉప‌సంహ‌రించుకోవాల‌ని విశాఖ శార‌దా పీఠం మేనేజ‌ర్ ఏపీ డీజీపీని ఓ లేఖ ద్వారా కోరారు. ఇక‌పై ఆయ‌న రుషికేశ్ లో త‌ప‌స్సులో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిపారు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో రాజ‌గురువులా ఓ వెలుగు వెలిగిన స్వ‌రూపానందేంద్ర త్వ‌ర‌లో రాష్ట్రాన్ని వీడి రుషికేశ్ లోనే ఉంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే  ఆయ‌న ఆంధ్రాను వ‌దిలి వెళ్ల‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంలా ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం ఆయ‌న్ను నెత్తిన పెట్టుకోలేదు. అంద‌రి స్వామిజీల‌కు ఇచ్చిన మ‌ర్యాదను ఆయ‌న‌కు ప్ర‌భుత్వం ఇస్తున్నది. జ‌గ‌న్ హ‌యాంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా త‌క్కువ ధ‌ర‌కే శార‌ద పీఠానికి భూముల‌ను కేటాయించారు.  వైసీపీ హయాంలో శారదా పీఠానికి రూ. 300 కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ. 15 లక్షలకే (ఎక‌రా ల‌క్ష చొప్పున) అప్పగించారనే అభియోగాలు ఉన్నాయి.  

దీంతో  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా క‌ట్ట‌బెట్టిన‌ ఆ కేటాయింపులను రద్దు చేసింది. మ‌రోవైపు తిరుమ‌ల‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా శార‌దా పీఠం కార్యాల‌యం కోసం నిర్మించిన   క‌ట్ట‌డాల‌ను ఇంజ‌నీరింగ్ విభాగం కూల్చేసింది. దీంతో జ‌గ‌న్ హ‌యాంలో ఐదేళ్లు ఆడిందే ఆట పాడిందేపాట‌గా కొన‌సాగిన స్వ‌రూపానందేంద్ర స్వామిజీకి కూట‌మి ప్ర‌భుత్వంలో షాక్‌ల మీద షాక్‌లు త‌గిలిన‌ట్ల‌యింది. దీంతో ఆయన రాష్ట్రం వదిలిపోవడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. లేకపోతే అప్పనంగా ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరలకు భూములు కొట్టేసినందుకో, తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకో కేసులను ఎదుర్కొనవలసి వస్తుందన్న భయం కూడా ఆయనలో ఉండి ఉంటుంది. అందుకే రాష్ట్రం దాటేస్తే రుషీకేశ్ లో తపస్సు పేరుతో న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవచ్చని స్వరూపానందేంద్ర భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.