కేంద్ర చట్టం పరిధిలోకి హైదరాబాద్ మెట్రో
posted on Sep 24, 2014 10:08AM
![](/teluguoneUserFiles/metro train(21).jpg)
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోంచి జారిపోయి కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. హైదరాబాద్ మెట్రో రైలును కేంద్ర మెట్రో రైలు చట్టం పరిధిలోకి తెస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పనులు ట్రామ్ వే చట్టం పరిధిలో వున్నాయి. అందువల్ల రైల్వే భద్రత బోర్డు మెట్రో ప్రాజెక్టు భద్రతా వ్యవహరాలను పరిశీలించడానికి నిరాకరిస్తోంది. కేంద్ర మెట్రో చట్టం పరిధిలోకి తెస్తేనే పర్యవేక్షిస్తామంటోంది. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖరాస్తూ మెట్రో ప్రాజెక్టును కేంద్రం పరిధిలోకి తీసుకోవాల్సిందిగా కోరింది. ఆ లేఖను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును కేంద్ర మెట్రో రైలు చట్టం పరిధిలోకి తీసుకుని వచ్చింది. మూడు మార్గాలలో మెట్రో రైలు ప్రయాణించే ప్రాంతాలను, స్టేషన్లను కూడా ఖరారు చేసింది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయినట్టుగా భావించవచ్చు. మెట్రో రైలు మార్గాన్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టయితే దాన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే చేయాల్సి వుంటుంది. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మెట్రో రైలు మార్గం మార్పు విషయంలో ఒత్తిడి ఎదుర్కొంటోన్న ఎల్ అండ్ టీ సంస్థకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఊరటను ఇచ్చిందని భావించవచ్చు.