బాబు ఒకందుకు మానుకొంటే...జగన్ మరొకందుకు బయలుదేరుతున్నారు
posted on Nov 10, 2015 2:24PM
_5701(1).jpg)
చంద్రబాబు నాయుడు ఒక కారణంతో వరంగల్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళకూడదనుకొంటుంటే, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో కారణంతో వరంగల్ ప్రచారానికి బయలుదేరుతుండటం విశేషం. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం సానుకూల వాతావరణం ఏర్పడినందున దానిని చేజేతులా చెడగొట్టుకోకూడదనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం లేదని సమాచారం. కానీ తెలంగాణా తెదేపా నేతలు మాత్రం యధాప్రకారం తమ పార్టీ బలపరుచుతున్న బీజేపీ అభ్యర్ధి విజయానికి కృషి చేస్తారు.
జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉంటున్నప్పటికీ ఎన్నడూ తెలంగాణా జిల్లాలలో అడుగుపెట్లేదు. కానీ ఇప్పుడు తమ పార్టీ అభ్యర్ధి నల్లా సూర్యప్రకాష్ కి మద్దతుగా నాలుగు రోజుల పాటు వరంగల్ ఉప ఎన్నికలలో ప్రచారం చేయడానికి బయలుదేరుతున్నారు. తమ పార్టీ అభ్యర్ధి ఈ ఎన్నికలలో గెలిచే అవకాశం బొత్తిగా లేదని తెలిసి కూడా వైకాపా ఎందుకు నిలబెడుతోందంటే బహుశః ప్రతిపక్ష ఓట్లను చీల్చి, తెరాసకు లబ్ది చేకూర్చడానికేనని ప్రత్యర్ధ పార్టీలు భావిస్తున్నాయి.
జగన్ కంటే ముందు వైకాపా ఫైర్ బ్రాండ్ లీడర్ రోజ కూడా వరంగల్ ఉప ఎన్నికలలో ప్రచారానికి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం జగన్ అమ్ముల పొదిలో రెస్ట్ తీసుకొంటున్న జగనన్న బాణం షర్మిల, వారి తల్లి విజయమ్మ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తమ పార్టీకే ఓటేయమని ప్రజలను అడిగేందుకు వైకాపా వద్ద ఒక్క బలమయిన కారణం కూడా లేదు. కనుక చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోక తప్పదు. ప్రజలకు స్వర్గీయ వై.యస్సార్ సెంటిమెంటు గుర్తు చేయాలంటే వారిద్దరికంటే మరెవరూ సరిపోరు. కనుక వారు కూడా ప్రచారంలో పాల్గొనవచ్చును. ఇంతా చేసి అది తెరాస విజయం సాధించేలా చేయడానికే తప్ప వైకాపా విజయం కోసం కాదంటే వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది.