మెట్రో రైల్ ప్రాజెక్టుకి కేసీఆర్ లైన్ క్లియర్
posted on Nov 16, 2014 8:54PM
.jpg)
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు-రెండవ దశ పనులపై నెలకొన్న సందిగ్దత తొలగిపోయింది. యల్. యండ్.టి. సంస్థ చైర్మన్ ఏ.యం. నాయక్ మరియు సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారంనాడు నిర్వహించిన సమావేశంలోఎవరికీ నష్టం జరగకుండా, అందరికీ ఆమోదయోగ్యమయిన విధంగా ప్రాజెక్టు పూర్తిచేయాలని అందరూ ఒక అంగీకారానికి వచ్చారు. రెండవ దశలో అలైన్మెంట్ మార్పు కారణంగా ఆయె అదనపు ఖర్చును ప్రభుత్వమే భరించేందుకు కేసీఆర్ అంగీకరించారు. కనుక కేసీఆర్ సూచించిన విధంగానే యల్. యండ్.టి. సంస్థ కూడా అలైన్మెంట్ మార్పుకి అంగీకరించింది. ప్రస్తుతం 70కి.మీ. పొడవున నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును 200కి.మీ.లకు పొడిగిద్దామని కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు సంస్థ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది.
ఈ ప్రాజెక్టు లాభదాయకం కాదు కనుక మధ్యలో వదిలి వెళ్లిపోతామంటూ ఇదివరకు ఆ సంస్థ చైర్మన్ ఏ.యం. నాయక తెలంగాణా ప్రభుత్వానికి వ్రాసిన లేఖను పట్టుకొని, ఆంధ్రాకు అనుకూలంగా పనిచేస్తున్న కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని ప్రాజెక్టు గురించి, ప్రభుత్వం గురించి కూడా చాల చెడు ప్రచారం చేశాయని, కానీ కోర్టు వివాదాలు, అభ్యంతరాల కారణంగానే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయిన అనుమతులు మంజూరు చేయడంలో ఆలస్యం అవుతోంది తప్ప, ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా చేయడం లేదని ఆయన వివరణ ఇచ్చాక. సంస్థ చైర్మన్ నాయక కూడా తన లేఖ వల్ల ప్రభుత్వానికి కలిగిన ఇబ్బందులకి చింతిస్తున్నానని తెలపడమే కాకుండా అందుకు బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు.
ఇకపై మెట్రో ప్రాజెక్టు నిర్మాణం మరింత వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణా ప్రభుత్వం నిర్మించతలబెట్టిన, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణం, ట్యాంక్ బ్యాండ్ చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం కోసం తమ సంస్థకు అవకాశం ఇవ్వాలని ఆయన అభ్యర్ధించారు. మళ్ళీ ఈ నెల 20న వారు మరోమారు సమావేశమయ్యి, ఈ ప్రాజెక్టులో మిగిలిన అంశాల గరించి కూడా చర్చిస్తారు.