తెలంగాణ మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు
posted on Nov 17, 2014 4:39PM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టుల సమస్య పెరిగే అవకాశాలు వున్నాయని కొంతమంది దుష్ప్రచారం చేశారని, అయితే అలాంటిదేమీ లేదని రాష్ట్రం చాలా ప్రశాంతంగా వుందని, మావోయిస్టులనేవాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోనే వున్నారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కోణం ఇలా వుంటే తాజాగా తెలంగాణ మంత్రులందరికీ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం వారం రోజుల క్రితం 70 వాహనాలు కొనుగోలు చేయడానికి నిధులను కూడా విడుదల చేసింది. ఈ నిర్ణయం అనేకమందికి అనేకానేక సందేహాలు కలిగిస్తున్నాయి. మావోయిస్టులతో ఇబ్బంది లేనప్పుడు మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి మావోయిస్లు సమస్య లేకపోయినా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనడం ఎందుకు? ప్రజల డబ్బును వృధా చేయడం ఎందుకున్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అలా ప్రశ్నించినవారిని సమాధానపరిచే సమాధానాలు మాత్రం రావడం లేదు.
ఇప్పుడు మంత్రులుగా వున్నవారి వాహనాలన్నీ పాతవైపోయినందున వారికి కొత్త వాహనాలు కొనడం తప్పనిసరి అయిందని, ఎలాగూ వాహనాలు కొంటున్నాం కాబట్టి ఆ కొనేవేవో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అయితే మరీ మంచిది కదా అనే ఉద్దేశంతోనే భారీ ఖర్చుతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొంటున్నామన్న సమాధానాలు అధికారవర్గాల నుంచి వస్తున్నాయి. అయితే ఈ సమాధానాలు విమర్శకులకు సంతృప్తిని కలిగించడం లేదు. నిజానికి ప్రభుత్వం మావోయిస్టుల నుంచి మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు ముప్పు పొంచి వుందని భయపడుతోందని, ఆ భయాన్ని బయటపెట్టడం ఇష్టం లేక ఏవేవో కారణాలు చూపిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇవ్వడంతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో వున్న మొత్తం వాహనాలను మొత్తం మార్చేసి అన్ని వాహనాలూ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వుండేలా చూసుకుంటున్నట్టు సమాచారం. వీటిలో ఒక్కో వాహనం ఖరీదు దాదాపు కోటి నలభై లక్షల రూపాయలు చేస్తుందని తెలుస్తోంది.