త్వరలో ఏపీకి మరో రెండు భారీ పరిశ్రమలు
posted on Nov 15, 2014 3:11PM
.jpg)
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పరిశ్రమలన్నీ దాదాపు హైదరాబాదుకే తరలిపోయేవి. ఆ కారణంగానే రాష్ట్రంలో మరే జిల్లాలో చెప్పుకోదగ్గ పెద్ద పరిశ్రమ ఒక్కటీ కనబడటం లేదు. కానీ రాష్ట్ర విభజన తరువాత ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రాష్ట్ర విభజనకు ముందు పారిశ్రామిక ప్రగతి ప్రసక్తే వినని ఆంద్రప్రదేశ్ లో విభజన తరువాత ఈ ఐదు నెలలోనే భారీ పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడుతుండటం చాలా శుభ పరిణామం.
కొన్ని రోజుల క్రితం హీరో మోటార్ సైకిల్స్ కంపెనీ దక్షిణ భారతదేశంలో తన మొట్ట మొదటి ఉత్పత్తి కేంద్రాన్ని చిత్తూరులో స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. సుమారు రూ.1600కోట్లతో ఆ కర్మాగారం నెలకొల్పుతున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి మరో భారీ సంస్థ రాబోతోంది.
భారతదేశంలో మంచి పేరు మోసిన ‘క్రిషబ్ కో’ ఎరువుల తయారీ కర్మాగారం నెల్లూరులో సర్వేపల్లి వద్ద గల పారిశ్రామిక వాడలో నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం 286 ఎకరాల భూమిని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏ.పి.ఐ.ఐ.సి.) బదలాయిస్తూ నిన్నే ఒక జీ.వో. జారీ చేసింది. ఏ.పి.ఐ.ఐ.సి. సంస్థ ఆ భూమిని ఎకరం ఏడూ లక్షల చొప్పున ‘కృషబ్ కో’కు అమ్ముతుంది. అదే ప్రాంతంలో యూ.పి.ఐ. పాలిమర్స్ అనే పైపులు, నీటిని వెదజెల్లే స్ప్రిన్క్లర్స్ మరియు డ్రిప్ ఇరిగేష్ పరికరాలు తయారుచేసే కర్మాగారం కోసం మరో 50 ఎకరాల భూని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్నన్నే ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు కాకుండా అదే ప్రాంతంలో 150 ఎకరాల విస్తీరణంలో కంటైనర్ కార్పోరేషన్ సంస్థ స్థాపించేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు వచ్చింది. త్వరలోనే దానికీ భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీ.ఓ.జారీ చేసే అవకాశాలున్నాయి.
నిజానికి ‘కృషబ్ కో’ యాజమాన్యం రాష్ట్రంలో ఈ భారీ కర్మాగారం స్థాపించేందుకు 2012లోనే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొంది. కానీ అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యమే ఇప్పుడు రాష్ట్రానికి వరంగా మారడం విశేషం. ఈ సంస్థ మొత్తం రూ.2000 కోట్లు రెండు దశలలో పెట్టుబడి పెడుతుంది. ఈ ఎరువుల కర్మాగారంలో రోజుకి 1600టన్నుల ఎరువు తయారవుతుంది. ఈ కర్మాగారం ద్వారా నేరుగా 300 నుండి 400 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తే, ప్యాకింగ్, రవాణా, కేటరింగ్, హోటల్ పరిశ్రమల ద్వారా పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది అని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏ.పి.ఐ.ఐ.సి.) చైర్మన్ పి.కృష్ణయ్య మీడియాకు తెలిపారు. త్వరలోనే ఈ క్రిషబ్ కో యాజమాన్యానికి భూమిని కేటాయించబోతున్నామని, వచ్చే ఏడాది మార్చిలోగా కర్మాగార నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతాయని ఆయన తెలిపారు. రెండేళ్లలో పరిశ్రమ పూర్తి స్థాయిలో ఉత్పత్తి మొదలుపెట్టగలదని క్రిషబ్ కో యాజమాన్యం తెలిపింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసినట్లయితే బహుశః మరిన్ని భారీ, మధ్య తరహా పరిశ్రమలు, ఐటీ సంస్థలు రాష్ట్రానికి క్యూ కట్టవచ్చును.