ఏసీబీ విచారణకు కేటీఆర్.. హాజరు.. గైర్హాజరు.. అంతా వ్యూహాత్మకమేనా
posted on Jan 6, 2025 1:38PM
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం (జనవరి 6) ఏసీబీ విచారణకు తన న్యాయవాదులతో హాజరయ్యారు. ఏసీబీ కార్యాలయం వరకూ వచ్చిన ఆయన అక్కడ మాత్రం హైడ్రామా ఆడారు. ఏసీబీ కార్యాలయంలోకి ఒంటరిగా హాజరయ్యే ప్రశ్నే లేదనీ, తన న్యాయవాదులను కూడా అనుమతించాలని పట్టుబట్టారు. అందుకు సహజంగానే ఏసీబీ అధికారులు నిరాకరించారు. దీంతో ఆయన దాదాపు గంటకు పైగా ఏసీబీ కార్యాలయం వద్దనే ఉండి.. పోలీసులో వాగ్వాదానికి దగి ఆ తరువాత తాపీగా వెనుదిరిగి వెళ్లిపోయారు.
దీంతో ఆయన ఏసీబీ విచారణకు హాజరౌనట్లూ అయ్యింది. ఏసీబీ తీరుతో ఆయన వెనుదిరిగారన్న ప్రచారానికీ ఆస్కారం లభించింది. కేసీఆర్ ఇదంతా వ్యూహాత్మకంగానే చేశారని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి న్యాయవాదులు లేకపోయినా ఆయన విచారణకు హాజరైతే వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఏసీబీ అరెస్టు చేయకుండా ఆయనకు కోర్టు నుంచి రక్షణ ఉంది. ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడేంత వరకూ అరెస్టు చేయవద్దంటూ ఏసీబీకి తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఏసీబీ విచారణకు వెళ్లినా ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అయితే ఆయన మంగళవారం (జనవరి 7) ఈడీ విచారణకు సైతం హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయనకు ఈడీ అరెస్టు నుంచి ఎలాంటి మినహాయింపూ లేదు. దీంతో ఆ విచారణకు డుమ్మా కొట్టాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. ఏసీబీ విచారణకు హాజరై, ఈడీ విచారణకు గైర్హాజరైతే విమర్శలు ఎదుర్కొన వలసి వస్తుందన్న భావనలో ఉన్న ఆయన ఏసీబీ విచారణకు హాజరైనట్లే హాజరై ఏసీబీ అధికారులతో వాగ్వివాదానికి దిగి వెనుదిరిగి వచ్చేశారు. ఇదే సాకుతో ఆయన ఈడీ విచారణకు డుమ్మా కొట్టేస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇంతకీ ఏసీబీ కార్యాలయం వరకూ వెళ్లి కేటీఆర్ వెనుదిరిగి వచ్చేయడానికి కారణమేంటంటే.. ఆయనకు ఆ విచారణ మీద నమ్మకం లేదట. న్యాయవాదుల సమక్షంలోనే తనను విచారించాలనీ, లేకుంటే తాను చెప్పని మాటలు చెప్పినట్లుగా వారు రాసుకుంటారనీ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి విషయంలో పోలీసులు అదే చేశారనీ కేటీఆర్ అంటున్నారు. లగచర్ల ఘటనలో పోలీసులు పట్నం మహేందర్ రెడ్డిని అరెస్టు పట్నం మహేందర్ రెడ్డి చెప్పని విషయాలతో ఆయన కన్ఫెక్షన్ నివేదిక తయారు చేసి కోర్టుకు సమర్పించారని ఆరోపించారు. ఆ తరువాత పట్నం తానసలు కన్ఫెక్షన్ స్టేట్ మెంటే ఇవ్వలేదని చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు.
ఇప్పుడు తన విషయంలో కూడా అదే జరుగుతుందని అనుమానం ఉందనీ, అందుకే తనతో పాటు తన న్యాయవాదులను కూడా అనుమతించాలని పట్టుబట్టి కేటీఆర్ విచారణకు హాజరు కాకుండా వెనక్కు వెళ్లిపోయారు. అంతే కాకుండా తాను ఇలా విచారణకు హాజరు కాగానే..అలా ఏసీబీ తన నివాసంపై దాడులకు పాల్పడుతుందన్న సమాచారం కూడా తనకు అందిందని ఆరోపించారు. మొత్తం మీద కేసీఆర్ వ్యూహాత్మకంగా ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా క్రియేట్ చేసి విచారణను తప్పించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏసీబీ అధికారులు కేటీఆర్ కు మాత్రమే నోటీసులు ఇచ్చారు. దీంతో తన న్యాయవాదులను అనుమతించరన్న విషయం కేటీఆర్ కు స్పష్టంగా తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా కేటీఆర్ తన న్యాయవాదులను తీసుకువచ్చి వివాదాన్ని క్రియేట్ చేసి విచారణకు హాజరు కాకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇదే సాకుతో మంగళవారం (జనవరి 7) ఈడీ విచారణకూ గైర్హాజరౌతారు. మొత్తం మీద విచారణను ఎదుర్కోకుండా తప్పించుకోవడానికి కేటీఆర్ వేసిన ఎత్తుగడ ఫలించింది.
ఇలా ఉండగా కేటీఆర్ విచారణను తప్పించుకోవడానికే లాయర్లను అనుమతించాలంటూ పట్టుబట్టారనీ, అయితే కేటీఆర్ కు ఫార్ములా ఈ కార్ కేసులో విచారించేందుకు తమకు తెలంగాణ హైకోర్టు అనుమతించిందనీ, ఆ సందర్బంగా న్యాయవాదుల సమక్షంలో విచారించాలన్న కండీషన్ ఏదీ పెట్టలేదనీ ఏసీబీ చెబుతోంది. కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే రచ్చ చెశారని ఆరోపిస్తోంది. త్వరలోనే మరోసారి నోటీసులు ఇచ్చి కేటీఆర్ ను విచారణకు పిలుస్తామని ఏసీబీ స్పష్టం చేసింది.