ఆలోచన ఉద్దేశం ఎలా ఉండాలి?

ఆలోచన ఒక అవసరానికి ముడివడకుండా ఉన్నంతవరకూ దానికి అర్ధవంతమైన గెలుపు ఉండదు. చాలా మందిలో ఆలోచన అనే ఒక బెరడు, జీవిత సాగరంలో దానికదే తేలిపోతూ ఉంటుంది. లక్ష్యం లేని ఆలోచన ఒక దుర్గుణం. ఆలోచనలను ఆలా తేలిపోనివ్వకూడదు. లక్ష్యం లేని ఆలోచనల వలన చివరకు జరిగేది విధ్వంసమే.

ఒక లక్ష్యం లేకుండా జీవించే వారు తేలికగా ఆందోళన, భయం, కష్టాలు నిర్వేదాల ఉచ్చులో పడతారు. ఈ బలహీనతలన్నీ ఖచ్చితంగా జరిగే ఒక పాపపు ప్రణాళికలా  ఓటమికీ, దుఃఖానికీ మరియూ నష్టానికీ దారి తీస్తాయి. ఎందుకంటే శక్తి ఆధారంగా పరిణతి చెందే ఈ విశ్వంలో బలహీనతకి చోటు లేదు.

ఒక మనిషి తన హృదయంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండి, దానిని చేరుకునేవరకూ పరితపించాలి. ఆ ఆశయాన్ని లేదా లక్ష్యాన్ని తన ఆలోచనల కేంద్రబిందువుగా చేసుకోవాలి. సమయ సందర్భాలను బట్టి, ఆ లక్ష్యం ఆధ్యాత్మిక ఆశయం కావచ్చు, లేదా ప్రాపంచిక విషయం కావచ్చు. అది ఏదైనప్పటికీ తన ఆలోచనాశక్తినంతా దాని మీదే పూర్తిగా లగ్నం చేయాలి. దానినే అతని పరమ విధిగా భావించి వేరే ఇతర వ్యాపకాల పట్ల కోరికల పట్ల, ఊహల పట్ల మనస్సుని పోనివ్వకుండా తదేక దీక్షతో సాధించే వరకూ శ్రమించాలి. ఇదే ఆత్మ నిగ్రహానికి మరియూ నిజమైన ఏకాగ్రతకు రాజమార్గం.

ఒక వేళ లక్ష్య సాధనలో మరలా మరలా ఓడిపోయినా (బలహీనతలను అధిగమించేవరకూ ఓటమి ఎలాగూ తప్పదు), వ్యక్తి శీలంలో అభివృద్ధి కనిపిస్తే అది విజమైన విజయానికి ఒక నిదర్శనం, భవిష్యత్తులో సాధించబోయే విజయానికి ఈ ఓటమి ఒక మెట్టులా, ఒక శక్తిలా పనిచేస్తుంది.

ఉన్నత లక్ష్యం గురించి ఆదుర్దా వద్దనుకునే వ్యక్తులు చేసేది ఎంత చిన్న పనైనా సరే, దానికి ఏమాత్రం విలువలేదనిపించినా సరే, ఎటువంటి అవకతవకలు లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే దాని మీదనే తమ ధ్యాసంతా ఉంచాలి. కేవలం ఈ విధంగానే ఆలోచనలను వృద్ధి చేసుకున్నప్పుడు అవి మరింత శక్తివంతంగా మారి లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయి.

శక్తిని వృద్ధి చేసుకునే ఏకైక మార్గం ఎడతెగని కృషి మరియూ సాధన మాత్రమే అని తెలుసుకుని, దానిని నమ్మిన మరుక్షణం, అతి బలహీనమైన వ్యక్తి అయినా సరే కష్టించి పనిచేయడం ప్రారంభిస్తాడు. కృషికి కృషినీ, ఓర్పుకి ఓర్పునీ, శక్తికి శక్తినీ జోడిస్తూ ఉంటే, వ్యక్తి అభివృద్ధి ఇక ఆగదు. అలా ఎదుగుతూ చివరకు ఎంతో దివ్యమైన శక్తిగా మారుతుంది.

శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి సహనంతో జాగ్రత్తగా సాధన చేస్తే ఎలా శక్తివంతంగా తయారవుతాడో అలాగే బలహీనమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి సరైన ఆలోచనల వలన మానసికంగా శక్తివంతంగా తయారుకాగలడు. నిర్లక్ష్యాన్ని, బలహీనతనూ దూరంగా ఉంచి, ఒక లక్ష్యం వైపు ఆలోచించడం మొదలుపెట్టడమంటే, ఓటమిని కూడా లక్ష్య సాధనలో ఒక భాగంగా పరిగణించే శక్తివంతులుగా మారడమే. అటువంటి వ్యక్తులు శక్తివంతంగా ఆలోచించి, భయంలేకుండా అడుగు ముందుకేసి, ఎటువంటి పరిస్థితినైనా తమకు అనువుగా మార్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు.

వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేరుకునే మార్గాన్ని మానసికంగా ఎంచుకుని దిక్కులు చూడకుండా ఋజుమార్గంలో పయనించాలి. అనుమానాలను, భయాలనూ పూర్తిగా తుడిచిపెట్టెయ్యాలి. 

ఎందుకంటే అవి నాశనానికి కారకాలు, కృషి అనే దారిని మళ్ళించి వ్యక్తిని ప్రభావరహితంగా పనికిమాలినవిధంగా తయారుచేయగలవు. అనుమానం, భయం ఎప్పుడూ ఏదీ సాధించింది లేదు, ఎప్పుడూ సాధించలేవు కూడా. అవి ఎప్పుడూ ఓటమికే దారి తీస్తాయి. అవి చేరిన వెంటనే లక్ష్యం, బలం, శక్తి, సంకల్ప శక్తి అన్నీ పనిచేయడం ఆగిపోతాయి.

ఏదైనా పని చేయగలమనే జ్ఞానం నుంచే చేయాలనే సంకల్పం పుట్టుకొస్తుంది. అనుమానం, భయం జ్ఞానానికి బద్ధ శత్రువులు. వాటిని చంపేయకుండా ఇంకా ఉత్సాహపరిచే వారు ప్రతి అడుగులోనూ ఇబ్బందికి గురవుతారు.

అనుమానాన్నీ, భయాన్నీ జయించినవాడు ఓటమిని కూడా జయిస్తాడు. అతని ప్రతి ఆలోచన, శక్తితో కూడుకుని ఉంటుంది, అతడు ప్రతి కష్టాన్నీ వివేకంతో మరియూ ధైర్యంతో ఎదుర్కొని జయించగలడు. నిర్భయమైన ఆలోచనకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం తోడైతే అది సృజనాత్మక శక్తిగా మారుతుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఊగిసలాడే ఆలోచనలతో మరియూ కొట్టుమిట్టాడే వాతావరణంతో ఉండే ఒక బుడగలా కాకుండా, పరిస్థితికి ఉన్నతంగా శక్తివంతంగా మారేదానికి సంసిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి తన మానసిక శక్తులను స్పృహతో మరియూ తెలివితేటలతో సమర్ధవంతంగా వాడుకోగలుగుతాడు.

                                 ◆నిశ్శబ్ద.

Related Segment News