పిఠాపురంలో జనసేనాని నివాసం వద్ద ఫ్లెక్సీల సందడి!

కొత్త సంవత్సరం సందర్భంగా పిఠాపురంలోని జనసేనాని నివాసం వద్ద ఫ్లెక్సీలు సందడి చేశాయి. జనసేన మద్దతుదారులు, కార్యకర్తలకు 2024 గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆ పార్టీ ఎన్నికలలో అద్భుత విజయాన్ని సాధించడమే కాకుండా, పార్టీ అధినేత జనసేనాని పిఠాపురం నుంచి మంచి మెజారిటీతో విజయం సాధించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలలోనూ, పార్లమెంటు స్థానంలోనూ విజయం సాధించి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది.

ఈ విజయాలతో ఆ పార్టీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా పిఠాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. ఊరంతా జనసేన ఫ్లెక్సీలతో నిండిపోయింది. ముఖ్యంగా పిఠాపురంలోని జనసేన నివాసం వద్ద ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ఫ్లెక్సీలలో పవన్ కల్యాణ్ పొటోతో పాటు ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలాగే పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా ఫొటోలు ఉండటం అందరూ ఆసక్తిగా చేసేలా చేశాయి. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.