అటవీ భూములనూ అప్పనంగా బొక్కేశారు.. వెలుగులోని సజ్జల కబ్జాల బాగోతం!?

వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న‌ అవినీతికి హ‌ద్దే లేదన్నట్లుగా సాగింది.  ఆ పార్టీ నేత‌లు అందినకాడికి ప్ర‌భుత్వ భూముల‌తోపాటు అట‌వీ భూములు, ప్రైవేట్ భూముల‌ను క‌బ్జాలు చేసేశారు. మ‌రికొన్ని భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కే జ‌గ‌న్ ప్ర‌భుత్వం తన అనుకూల ట్ర‌స్టుల‌కు, కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టేసింది. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తార‌ని అధికారాన్ని అప్ప‌గిస్తే.. జ‌గ‌న్ మాత్రం త‌న హ‌యాంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే ప‌నిగాపెట్టుకొని పాల‌న‌ను గాలి కొదిలేశారు. దీంతో వైసీపీ హ‌యాంలో రాష్ట్రం క‌నీస‌ అభివృద్ధికి నోచుకోక‌పోవ‌డంతో దేశంలోనే ఏపీ అట్ట‌డుగు స్థాయికి వెళ్లిపోయింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విడిపోయిన త‌రువాత  2014లో తొలిసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో  తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని దేశానికే ఆద‌ర్శంగా తీర్చిదిద్దేందుకు త‌న‌ వంతు కృషి చేశారు. అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధానిగా ఏర్పాటు చేయ‌డంతోపాటు, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను ప‌రుగులు పెట్టించాడు. అవినీతి, అక్ర‌మాల‌కు తావులేకుండా ఐదేళ్లు చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకు దూసుకెళ్లింది.  2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఒక్క చాన్స్ ప్లీజ్ అన్న జగన్ ను నమ్మి ఆయనకు అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. ముఖ్య‌మంత్రి చైర్‌లో కూర్చున్న మొద‌టి రోజు నుంచే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక్షేమాన్ని గాలికొదిలేసి.. రాష్ట్రాన్ని దోచుకోవ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నారు. 

జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో స‌హా ఆయ‌న కేబినెట్‌లోని మంత్రులు, వైసీపీ ముఖ్య‌నేతలు ఐదేళ్ల కాలంలో ప్ర‌భుత్వ, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఐదేళ్లు మంత్రిగా కొన‌సాగిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న కుటుంబం పెద్ద ఎత్తున  భూముల‌కు క‌బ్జాచేసింది.  పెద్దిరెడ్డి తన సతీమణి, కుమారుడి పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వంద‌ల ఎక‌రాల భూముల‌ను క‌బ్జా చేశారు. ఆయన తమ్ముడు, ఇతర కుటుంబసభ్యులు వారి అనుచరులు, బినామీల పేర్లతో దోచుకున్న‌ భూములకు లెక్కేలేదు. విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి భూదందా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలా వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ నేత‌ల భూక‌బ్జాల ప‌ర్వం మూడుపువ్వులు ఆరు కాయ‌లుగా సాగింది. దీనికితోడు రేష‌న్‌ బియ్యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించి కొంద‌రు  వైసీపీ నేత‌లు భారీ మొత్తంలో ప్ర‌భుత్వ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. కాకినాడ పోర్టు వేదిక‌గా రేష‌న్ బియ్యాన్ని దేశం ఎల్ల‌లు దాటించి వంద‌ల కోట్ల‌ను వైసీపీ నేత‌లు ఆర్జించార‌ని ఆరోపణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రేష‌న్‌ బియ్యం దోపిడీ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.  దీంతో ప్ర‌స్తుతం పేర్ని నాని, ఆయ‌న భార్య‌తోపాటు మ‌రో న‌లుగురిపై కేసులు న‌మోద‌య్యాయి. గోదాములోని రేష‌న్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు త‌ర‌లించి సొమ్ము చేసుకున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే పేర్ని నానిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే క్ర‌మంలో తాజాగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న కుటుంబం భూదందా వ్య‌వ‌హారం సైతం వెలుగులోకి వ‌చ్చింది. 

వైసీపీ  హ‌యాంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి క‌బ్జాల ప‌ర్వం ఇప్పుడు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏకంగా అట‌వీ భూమిని సజ్జల క‌బ్జా చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైసీపీ  హయాంలో  ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా, జగన్ కు రైట్ హ్యాండ్ గా స‌జ్జ‌ల ఉన్నారు. వైసీపీ ప్ర‌భుత్వంలోనూ, పార్టీలోనూ ఏప‌ని జ‌ర‌గాల‌న్నా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఓకే చెబితేనే ఫైలు ముందుకు క‌దిలేది. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని స‌జ్జ‌ల భారీ ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌జ్జ‌ల‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌చ్చాయి. త‌మ భూముల‌ను క‌బ్జా చేశార‌ని కూట‌మి ప్ర‌భుత్వానికి ప‌లు ఫిర్యాదులు సైతం  అందాయి.  దీంతో వాటిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా స‌జ్జ‌ల రామ‌కృ ష్ణా రెడ్డి భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ ఏకంగా 42 ఎక‌రాల అట‌వీ భూమిని క‌బ్జా చేసిన‌ట్లు విమ‌ర్శ‌లున్నాయి. అందులో పండ్ల‌తోట‌లు, ఇత‌ర పంట‌లు సాగు చేస్తున్నారు. అంతే కాక అట‌వీ భూముల్లో గెస్ట్ హౌస్‌లు, ప‌నివారికోసం షెడ్లు క‌ట్టించారు. అయితే, స‌జ్జ‌ల పేరు బ‌య‌ట‌కు రాకుండా ఆయ‌న అండ‌తో  సోద‌రులు, కుటుంబ స‌భ్యులు అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్లు స‌మాచారం. వారంతా స‌జ్జ‌ల బినామీలేన‌ని ప్ర‌చారం జరుగుతోంది. గ‌త ప్ర‌భుత్వంలో స‌జ్జ‌ల సోద‌రులు క‌డ‌ప శివారు ప్రాంతంలో చేసిన అక్రమాలు కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వెలుగులోకి వ‌చ్చాయి. 

సీకేదిన్నె రెవెన్యూ ప‌రిధిలోని ప‌లు స‌ర్వే నెంబ‌ర్ల‌లో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సోద‌రుడు దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు సందీప్ రెడ్డికి దాదాపు 130కిపైగా ఎక‌రాలు ఉన్నాయి. అయితే, సీకేదిన్నె రెవెన్యూ ప‌రిధి స‌ర్వే నెంబ‌ర్‌ 1629లో 11వేల 129 ఎక‌రాల అట‌వీ భూమి ఉంది. స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ దీనికిలోని కొంత భూమిని ఆక్ర‌మించేశారు. ఇక్క‌డ స‌జ్జ‌ల ఎస్టేట్‌కు సంబంధించి మొత్తం 206 ఎక‌రాల భూమి ఉంది. ఇందులో ప‌ట్టాభూమి 147 ఎక‌రాలుకాగా..  ప్ర‌భుత్వం భూమి ప‌దెక‌రాలు, డీకేటీ ఆరు ఎక‌రాలు, చుక్క‌ల భూమి రెండెక‌రాలు ఉన్నాయి. ఈ స‌ర్వే నెంబ‌ర్ లోని అట‌వీ భూమిలో 42 ఎక‌రాల‌ను స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ ఆక్ర‌మించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ప్రాంతంలోకి ఇత‌ర వ్య‌క్తుల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి బినామీల‌తో అట‌వీ భూముల్లో ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశార‌ని స్థానికులు పేర్కొంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఇప్ప‌టికీ ఆ భూములు రిజ‌ర్వ్ ఫారెస్ట్ ప‌రిధిలోనే ఉన్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అన్యాక్రాంత‌మైన‌ అట‌వీ భూములపై ఫోక‌స్ పెట్ట‌గా స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ క‌బ్జాల ప‌ర్వం వెలుగులోకి వ‌చ్చింది. ఆ భూముల్లో అధికారులు స‌ర్వే చేయిస్తున్నారు. స‌జ్జ‌ల పేరుపైనా అక్క‌డ భూములు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో పూర్తి వివ‌రాల‌ను అధికారులు సేక‌రిస్తున్నారు. ప‌క్కా ఆధారాల‌ను సేక‌రించిన త‌రువాత స‌జ్జ‌ల‌ను, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. మొత్తానికి త్వ‌ర‌లోనే స‌జ్జ‌ల, ఆయ‌న కుటుంబ స‌భ్యులు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.