ఛాలెంజ్ తీసుకోండి

సాదారణంగా ప్రతి ఒక్కరు ఏదైనా చేయాలని అనుకునేముందు తమ శక్తి సామర్త్యాలు తరచి చూసుకుంటూ ఉంటారు. కొందరు అయితే అది మనకు తగిన పని కాదు అనుకుంటారు. దాని వల్ల జరిగేది ఏమిటి?అనుకున్నది, కాస్త ఆశ పడినది, జీవితంలో కావాలని అనుకున్నది దూరమైపోవడం. 
అంతకు మించి ఇంకా ఏమైనా ఉందా?

ఎందుకు లేదు!!

అలా ఏదో శక్తి సామర్త్యాల పేరుతో దాన్ని వదిలేసుకోవడం వల్ల జీవితంలో ముఖ్యమైన దశ నిస్తేజంగా ఉండిపోవచ్చు కదా!! నిజానికి మనిషి ఏదైనా కావాలని అనుకుంటే అందులో నైతికత అంటూ ఉంటే దాని వల్ల జీవితంలో ఎదుగుదలనే ఉంటుంది తప్ప అదఃపాతాళంలోకి పడిపోవడమంటూ ఉండదు. 

మరి ఎందుకు భయం!!

భయమంటూ ఉంటే అది శక్తి సామర్త్యాల గురించి కంటే నలుగురు ఏమంటారో, ఎలా అనుకుంటారో అనే మీమాంస అధికశాతం మందిలో ఉండటం బాగా గమనించవచ్చు. ఇకపోతే ఇలా చేయాలని అనుకుంటున్నాని ఇంట్లో కావచ్చు, స్నేహితులతో కావచ్చు ఇతరులతో కావచ్చు చెప్పినపుడు ఎక్కువగా ఎదురయ్యే మాట నువ్వు చేయగలవా?? నీకు అంత సీన్ ఉందా అని. అంటే ఇక్కడ మీలోని సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మొగ్గలోనే తుంచేసే సంఘటనలు ఎదురవుతాయి. అందుకే ఎప్పుడూ నిరుత్సాహ పరిచే వాళ్ళ దగ్గర చేయబోయే పనుల గురించి ప్రస్తావించకూడదు. 

కష్టే ఫలి!!

కష్టానికోక సిగ్నేచర్ ఉంది. కష్టాన్ని చేతుల్లో ఒడిసిపట్టాము అనుకోండి అప్పుడు అది విజయం అనే సంతకంగా మారుతుంది. ఇది నిజం కావాలంటే ఒకసారి దాని రుచి చూడాల్సిందే. ఏ పనిని అలా ఒక రాయేద్దాం అనుకోకూడదు. అక్కడే, ఆ నిర్లక్ష్యపు అడుగే అపజయపు మొదటి మెట్టు అవుతుంది. కాబట్టి చేయాలని నుకుని పనిని సీరియస్ గా తీసుకోవాలి. దానికోసం వంద శాతం శ్రద్ధ పెట్టాలి. అపుడు దాని మీద అవగాహన పెరుగుతుంది. పలితంగా దాన్ని ఎలా చేస్తే సమర్థవంతంగా పూర్తవుతుందో తెలిసిపోతుంది. అప్పుడే చేయాలని అనుకున్న పని తాలూకూ విజయం వినయంగా మీకోసం నడుచుకుంటూ వచ్చేస్తుంది.

ట్రస్ట్ యువర్ సెల్ఫ్...

మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. చేయాలని అనుకునే ప్రతి పని మీది కాబట్టి దాని కోసం ఎలాంటి మీమాంసలు పెట్టుకోకుండా, దాని గూర్చి పూర్తిగా తెలుసుకుని, దానికి తాగినట్టు మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకుని అప్పుడు ముందుకు వెళ్ళాలి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించి తీరగలుగుతారు. 

మీతో మీరే!!

నిజం చెప్పాలంటే ఎప్పుడు ఎవరితోనూ పోటీ పెట్టుకోకూడదు. పోటీ పెట్టుకుంటున్నాం అంటే మీ శక్తి సామర్త్యాలు ఇతరులతో కంపెర్ చేస్తున్నట్టే కాబట్టి మిమ్మల్ని ఎవరితోనూ కంపెర్ చేసుకోకండి. మీరు నిర్దేశించుకున్న పనిని, లక్ష్యాన్ని సాధించడానికి మీతో మీరే పోటీదారులుగా ఉండాలి. 

విజయీభవ!!

విజయానికి మొదటి సూత్రం చేయాలని అనుకున్న పనిని చేయడం. అది కూడా దాని గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడు సరైన ప్రణాళికతో చేయడం. ఎలాంటి అవగాహన లేకుండా దాని గూర్చి తెలుసుకుని విజయం సాధించిన వారి గురించి, వారి ప్రణాళికలు గురించి తెలుసుకుని వాటి నుండి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం.

మనసుంటే మార్గం!!

కొన్ని సార్లు చాలామంది అది చేయాలి ఇది చేయాలి అని మనసులో ఎన్నో అనుకుంటారు కానీ వాటిని ఆచరణలో పెట్టకుండా కాలక్షేపం చేస్తుంటారు. దానికి ఎన్నో కారణాలు కూడా చెబుతుంటారు. కాబట్టి ముందు చేయాల్సింది అలా కాలక్షేపం చేసే మెంటాలిటీ ని వదిలేయడం. చేయలనుకున్న పనివల్ల జీవితం ఎంత మెరుగవుతుందో అంచనా వేసుకోవడం. ప్రస్తుతం ఏ పని చేయాలన్నా నెట్ లో బోలెడు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి అన్ని విధాలుగా మంచి దారులు ఉన్నట్టే. కావాల్సింది కేవలం

మనసు పెట్టడమే!!

ఇట్లా అన్ని విధాలుగా తెలుసుకుని మీతో మీరు ఛాలెంజ్ తీసుకోండి. అందులో విజయం సాదించండి. ఆ కిక్కే వేరప్పా…. దాన్ని అనుభూతి చెందాల్సిందే  తప్ప మాటల్లో ఫీల్ కాలేం!!


                                                                                                                              ◆ వెంకటేష్ పువ్వాడ

Related Segment News