నాగార్జున కొండలో విదేశీ బౌద్ధ పరిశోధకులు
posted on Jan 2, 2025 6:50PM
చరిత్ర వివరించిన శివనాగిరెడ్డి
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, తైవాన్ దేశాలకు చెందిన బౌద్ధ పరిశోధకులు గురువారం నాడు నాగార్జున కొండను సందర్శించారని పురావస్తు పరిశోధకుడు బుద్ధవనం కన్సల్టెంట్, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ లోని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నాగార్జునకొండకు వచ్చిన న్యూజిలాండ్కు చెందిన ప్రొఫెసర్ సారా, ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ జాఫ్రిషా ఇంకా హాంకాంగ్, తైవాన్లకు చెందిన ముగ్గురు పరిశోధకులకు శివనాగిరెడ్డి నాగార్జునకొండ మ్యూజియం లోని బౌద్ధ శిల్పాలు, శాసనాలు, సాగర జలాశయం ముంపు నుంచి తరలించిన బౌద్ధ స్తూపాలు, చైత్యాలు, విహారాలు, వైదిక క్రతు వేదికలు శ్రీ పర్వత విజయపురిలోని ఇక్ష్వాకుల కట్టడాలు, ఆచార్య నాగార్జునుని రచనల గురించిన చారిత్రక వివరాలను తెలియజేశారు.
మ్యూజియం అధికారి కమల్ హాసన్ బౌద్ధ పరిశోధకులకు నాగార్జునకొండ తవ్వకాలు మ్యూజియం నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆమోదం పురావస్తు అధికారి డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధ వనం అధికారులు డి ఆర్ శ్యాంసుందర్రావు, డాక్టర్ రవిచంద్ర పాల్గొన్నారు.