రోమ్ ను పాలించిన హాడ్రియన్ రాజు వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసా?

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అనే సామెత ఎప్పుడు పుట్టిందోకానీ, ఆనాటికే ఒక వందకోట్ల దరిద్రాలను లెక్కించారనుకోవాలి. మానవతావాదం, సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన నేటి కాలంలోనే దరిద్రమింత విస్తృతంగా అనేక ప్రాంతాల్లో, అనేక వర్గాల్లో విలయతాండవం చేస్తున్నదంటే, ఇక రాజులు, రంగప్పలు తమ ఇష్టం వచ్చినట్లు పన్నులు వసూలు చేస్తూ పరిపాలించిన రోజుల్లో అధికాధిక ప్రజానీకం ఎంతటి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారో మనకు తెలియదు.

నిజానికి నేటి సాంకేతిక పరిజ్ఞానంతో దారిద్ర్యాన్ని చాలావరకు నిర్మూలించే వీలుంది. కాని ఈ విజ్ఞానాన్ని అందుకు వినియోగించకపోగా, కొత్త కోర్కెలను సృష్టించడానికే వినియోగిస్తున్నారు. ఈనాడు ప్రభుత్వాలూ, ప్రజలూ తలుచుకుంటే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి తిండీ, బట్టా సమకూర్చడం అంత కష్టమైన విషయం కాదు. కానీ ప్రభుత్వాలకు ఆయుధాలను ఉత్పత్తిచేసే విషయం మీద ఉన్నంత శ్రద్ధ ప్రజలకు తిండీ, బట్టా అందించడంలో వుండటం లేదు.

మనుష్య జాతి యావత్తూ ఒకటే అయి, జాతిమతభేదాలు పాటించడం మానేస్తే ఆయుధాలపై వ్యయం అవసరం లేదు, నేడు లభ్యమయ్యే ఉత్పత్తి సాధనాలతో ప్రపంచ వ్యాప్తంగా దారిద్ర్యాన్ని ఇట్టే నిర్మూలించవచ్చు.

ఇలా జరగకపోవడానికి కారణం ప్రభుత్వాలూ, వాటిని ఎన్నుకున్న ప్రజలూ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక దరిద్రం మీద ఎన్నిసార్లు యుద్ధం ప్రకటించినా, దానిని నిజంగా తొలగించగలమా అనే అనుమానం వస్తుంటుంది. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కొన్ని కొన్ని వర్గాలు దారిద్ర్యాన్ని అనుభవిస్తూనే వున్నాయి.

ఏది ఏమైనప్పటికీ తూర్పు ఖండాల్లో కనిపించే కటిక దారిద్య్రం పశ్చిమ దేశాల్లో కనిపించదు. ఆ దేశాల్లోని జీవన ప్రమాణాలను అనుసరించి కొన్ని వర్గాల వారికి తగినన్ని సౌకర్యాలు ఉండకపోవచ్చు కానీ, అసలు తిండికీ, గుడ్డకీ నోచుకోని పరిస్థితి లేదు. ఆ మాటకొస్తే తిండీ, గుడ్డా, ఒకమాదిరి వసతీ లేకుండా మనిషి అక్కడ అసలు బ్రతకలేడు. దేహంలో వెచ్చదనం త్వరితంగా క్షీణించి మరణిస్తాడు. ఇంకా అభివృద్ధి చెందని మన తూర్పుదేశాల్లో తిండీ, బట్టా, వసతి లేక పోయినా, వాతావరణం పొడిగా వుంటుంది కాబట్టి, నీళ్లు త్రాగి చెట్టుక్రింద పడుకొని కూడా కొన్నాళ్లు ప్రాణం నిలుపుకోగలడు. అయినప్పటికీ దారిద్ర్యదుఃఖం భరించడం ఎవరికైనా చాలా కష్టం.

పూర్వం రెండవ శతాబ్దంలో హాడ్రియన్ మహారాజు రోమ్ ను పరిపాలిస్తున్న కాలంలో ఒక పౌరుడు తన దారిద్ర్యాన్ని తట్టుకోలేక పోయాడు. అయినప్పటికీ ఆత్మహత్య మహాపాతకమనే విశ్వాసం ఉన్నందువల్ల హాడ్రియన్ మహారాజును చాలా దారుణంగా  తిడుతూ తన పేరుతో ఒక ఉత్తరం వ్రాసిపడేశాడు.

హాడ్రియన్ దాన్ని చదివి, ఆ ఉత్తరం రాసిన వాడిని  పిలిపించాడు. “నువ్వు మహారాజును చాలా తీవ్రంగా దూషించావు. ఇలాంటి అపరాధానికి శిక్ష మరణదండన అన్న సంగతి నీకు తెలియనిది కాదు. కానీ చేతులారా ఇలాంటి లేఖవ్రాసి నీ చావును నువ్వే ఎందుకు కొని తెచ్చుకున్నావో నాకు అర్థం కాకుండా వుంది. ఏమిటి నీ ఉద్దేశం?” అని అడిగాడు.

"మహారాజా, మీరు నాకు మరణశిక్ష విధిస్తే, ఒక్క దెబ్బతో నాకు మూడు బాధలు నివారణ అవుతాయని ఆశించాను" అన్నాడు ఆ నిర్భాగ్యుడు.

"ఏమిటా మూడు బాధలు?"

"మొదటిది నాకు తినడానికి తిండిలేదు. రెండవది కట్టుకోవడానికి బట్ట లేదు. మూడవది నాతోబాటు నా భార్యా, పిల్లవాడూ కూడా ఇదే బాధను అనుభవిస్తున్నారు. ఇది అసలే చూడలేకుండా వున్నాను. ఈ మూడు బాధలూ మీ మరణశిక్షతో అంతమవుతాయని ఎదురు చూస్తున్నాను" అన్నాడు.

నిర్దాక్షిణ్యానికి మారుపేరుగా చలామణి అయిన హాడ్రియన్ రాజు "వీణ్ణి వదిలేసి ఇలాగే జీవించనివ్వండి. మరణించడంకన్నా ఇతడికి జీవించడమే పెద్ద శిక్ష అని నాకు తోస్తుంది" అని తీర్పు చెప్పాడు. ఇదీ చరిత్రలో దారిద్య్రం తీరు,  హాడ్రియన్ రాజు వ్యక్తిత్వం.

                                       ◆నిశ్శబ్ద.