ప్రమాదాలను కొనితెచ్చుకునే మనస్తత్వం!

కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో...

ఓ ఆలోచన!

తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.

 

ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం

ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది.
ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.

 

 

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!

 

- నిర్జర.