పాస్‌బుక్ మీద ఫొటో... రైతుల ఓట్లు మటాష్!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో కారణాలు వున్నప్పటికీ, చాలా ముఖ్య కారణంగా చెప్పుకోవాల్సిన విషయం... రైతుల భూమి హక్కు పత్రం అయిన పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటో ప్రచురించుకోవడం. తమ పూర్వికులు వారసత్వంగా ఇచ్చిన భూమి, తాము కష్టపడి సంపాదించుకున్న భూమి హక్కు పత్రాల పుస్తకం మీద జగన్ ఫొటో వుండటాన్ని రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వున్నారు. అయితే బాహాటంగా వ్యతిరేకిస్తే వేధించి ఉసురు తీస్తారన్న భయంతో ఇంతవరకు ఎవరూ కిక్కురుమని కూడా అనలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా రైతులకు తమ పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. తమ పట్టాదార్ పాస్ పుస్తకాల మీద జగన్ ఫొటో పోవాలంటే, జగన్‌ని గద్దెదించడం మినహా మరో మార్గం లేదని రైతులు నిర్ణయించుకున్నారు. ఎక్కడోదాకా ఎందుకూ, జగన్ నియోజకవర్గంలోని పులివెందులలోనే వైసీపీ కార్యకర్త అయిన ఓ రైతు సాక్షాత్తూ భారతి ముందే ఈ విషయంలో నిరసన వ్యక్తం చేశాడంటే ఈ అంశం మీద రైతుల్లో ఎంత వ్యతిరేకత వుందో అర్థం చేసుకోవచ్చు. అలా జగన్ ప్రభుత్వం కూలిపోగానే ఇలా పాస్ బుక్‌లో జగన్ ముఖాన్ని చించేయడానికి రైతులు సిద్ధంగా వున్నారు.

పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటో వుండటం వల్ల రైతుల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని వైసీపీ నాయకులకు బాగా అర్థమైంది. రైతుల ఆస్తి మీద కూడా తన ఫొటోను ముద్రించుకోవాలనే దురాశకు రైతులు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని తెలుసుకున్న నాయకులు ఇప్పుడు నాలుక్కరుచుకుంటున్నారు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.