సెల్ఫ్ కేర్ ఎందుకు ముఖ్యం?? దానికోసం ఏమి చెయ్యాలి?

ప్రతి మనిషికి తన జీవితంలో సెల్ఫ్ కేర్ అనేది చాలా ముఖ్యం. ఇది మనిషి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అవసరమైన సమయాన్ని కేటాయించుకోవడానికి,  తమ మీద తమకు శ్రద్ధను పెంచుకోవడానికి సహాయపడుతుంది. చాలామందికి ఎదురయ్యే అనారోగ్య సమస్యలు ఎక్కువ భాగం సెల్ఫ్ కేర్ లేకపోవడం వల్లనే సంభవిస్తాయి. నేటి బిజీ బిజీ జీవితాలలో ఎవరికీ తమకు తాము కాసింత సమయాన్ని కేటాయించుకునే తీరిక, తమ గురించి, తమ శారీరక, మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయి?? వాటి స్థాయి ఏంటి?? ఏ విషయాలకు ఎలా స్పందిస్తున్నాను?? నేను స్పందిస్తున్న తీరు సరైనదేనా అనే ఆలోచన కూడా ఉండనే ఉండదు. అదే సెల్ఫ్ కేర్ ఉంటే మనిషిని పీడించే ఒత్తిడి దరిదాపుల్లోకి కూడా రాదు.

సెల్ఫ్ కేర్ మనిషిని శక్తివంతంగా చేయడంతో పాటు చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలు తమ మీద ప్రభావం చూపించకుండా ఉండేలా కూడా చేయగలుగుతుంది. అయితే సెల్ఫ్ కేర్ వల్ల మనిషిలో పెంపొందించుకోవాల్సింది ఏంటి?? అనే ప్రశ్న చాలా మందిలో ఎదురవుతుంది. సెల్ఫ్ కేర్ లో అందరూ తెలుసుకోవాల్సినవి మీకు అవసరమైనది ఏంటో తెలుసుకోవడం. మీ దృష్టిలో మీకు విలువైనది, మీ జీవితంలో విలువైనది ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

ప్రతి ఒక్కరి జీవితానికి కొన్ని విషయాలు, కొన్ని నిర్ణయాలు, కొన్ని పరిస్థితులు సరిపోయేట్టు ఉంటాయి. అలాగని అందరి జీవితాలకు అవే సమంజసమైనవి అని చెప్పలేం. ఎవరి జీవితానికి ఏమి కావాలి?? అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం కూడా అవసరం అవుతుంది.  

అందరూ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే సెల్ఫ్ కేర్ అనేది ఒకసారి మాత్రమే చేసే పని కాదు. ఒక్కసారితో అది ముగిసిపోదు. జీవితం సాగుతున్నన్ని రోజులూ సెల్ఫ్ కేర్ గురించి నిర్ణయాలు, ఆలోచనలు, ఆచరణలు సాగుతూనే ఉండాలి. మనిషిలో హార్మోన్ల స్థాయి కూడా ఈ సెల్ఫ్ కేర్ విషయంలో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనిషి మానసిక స్థితిని ఆలోచనల తీరును ప్రభావితం చేసే కొన్ని చిట్కాలు ఫాలో అయితే సెల్ఫ్ కేర్ విషయంలో చురుగ్గా ఉండగలుగుతారు. ఎంతో సులువైన, కేవలం ఒక్క నిమిషం సమయం మాత్రమే కేటాయించగలిగే కొన్ని టిప్స్ ఇక్కడున్నాయి.

చిన్నపిల్లలు నాలుక బయట పెట్టి అల్లరి పని చేసినట్టు చెయ్యాలి. దీనివల్ల ఎంతో ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఒత్తిడి శాతం తగ్గిపోతుంది.

అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుని మీలో మీకు నచ్చే మూడు విషయాలు ఏమైనా చెప్పుకోండి. దీనివల్ల మీలో ప్రత్యేకత ఏమిటి అని మీకే తెలుస్తుంది.

నెగిటివ్ ఆలోచనలు వదిలెయ్యాలి. మనసులో మీరు కోరుకునేది ఏంటో దాన్ని బలంగా పదే పదే మననం చేసుకోవాలి. దానికోసం ఒక నిమిషమైనా ప్రార్థన చేసుజకోవాలి.

మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేలా వాతావరణాన్ని మార్చుకోవాలి. ఇష్టమైన పూలు, నచ్చిన వాసన ఉన్న పెర్ఫ్యూమ్, నచ్చిన ఎసెంటియల్ ఆయిల్ తో గదిని, ఇంటిని, ఉద్యోగం చేస్తున్న మీ క్యాబిన్ ను ఆహ్లాదంగా మార్చుకోవచ్చు. మనసుకు చాలా రిలీఫ్ ఇస్తుంది ఈ పని.

స్నేహితులు, బంధువులు, పెంపుడు జంతువులు, కొలీగ్స్ ఇలా ఎవరిని అయినా సరే హృదయపూర్వకంగా కౌగిలించుకోవాలి. కౌగిలికి చాలా మంచి పవర్ ఉంది. కేవలం ఆరు సెకన్ల కౌగిలింతకు ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి మనిషిలో పాజిటివ్ ఫీలింగ్స్ ను పెంచుతాయి.

శరీరాన్ని తరచుగా సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. శారీరకంగా కలుగుతున్న మార్పులు ఏమిటనేది గుర్తిస్తూ ఉండాలి. బాడీ ఫిట్ గా ఉంచుకోవడంలో ఇది పనిచేస్తుంది.

కళ్ళు మూసుకుని సంతోషంగా గడిపిన క్షణాలు, సందర్భాలను గుర్తుచేసుకోవాలి. వాటిని గుర్తుచేసుకున్నప్పుడు సహజంగానే మనసు సంతోషంగా మారుతుంది.

ఇలా సెల్ఫ్ కేర్ కోసం పైన చెప్పుకున్నవి పాటిస్తూ ఉంటే మనిషి జీవితం ఎంతగానో మార్పు చెందుతుంది. ఎంతో గొప్ప భవిష్యత్తులోకి వెళ్తుంది.

                                      ◆నిశ్శబ్ద.