దర్యాప్తు చకచక.. వైసీపీ నేతలు గజగజ!
posted on Oct 5, 2024 6:55AM
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నచందంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పుతో వైసీపీయుల గొంతులో కల్తీలడ్డూ పడి వారి పరిస్థితి కక్కాలేక మింగా లేక అన్నట్లుగా తయారైంది. ఒకపక్క కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెబుతున్నప్పటికీ, వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్వతంత్ర సిట్ ఎర్పాటు కాగానే తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు చకచక సాగుతుందన్న భయంతో వైసీపీయులు గజగజ వణికిపోతున్నారు. కోర్టు తీర్పు తరువాత మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం చూసిన ఎవరికైనా ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది.
సుప్రీంకోర్టు తీర్పుకే వక్రభాష్యాలు చెప్పుకుని అసలు లడ్డూలో కల్తీనే జరగలేదని జగన్ తేల్చేశారు. ఇక ప్రత్యేక సిట్ కూడా అవసరం లేదనేశారు. . సుప్రీం కోర్టు సిట్ కూడా అవసరం లేదన్నట్లుగా ఆయన మాట్లాడారు. దీంతో వైసీపీ వర్గాల్లోనే విస్మయం, ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో తిరుపతిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. అందులో తిరుపతి లడ్డూ వివాదం ఒకటి. అయితే, తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం చాలా చిన్నదని.. అంతకంటే పెద్దెత్తున అవినీతికి వైసీపీ నేతలు పాల్పడ్డారని వారాహి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో లడ్డూ కల్తీ విషయంలో అడ్డంగా దొరకడంతో పాటు, కొండపై ఐదేళ్లు సాగించిన అవినీతి అక్రమాలు కూడా బయటకు వస్తాయన్న ఆందోళన జగన్, వైసీపీ నేతలను వెంటాడుతోంది.
వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పొన్నంవోలు సుధాకర్ రెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి తదితరులు తిరుపతిలో కల్తీ లడ్డు వివాదం విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కల్తీ లడ్డూ వ్యవహారానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయం చేశారు, భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు, రాష్ర ప్రభుత్వం పర్యవేక్షణలో విచారణ కాకుండా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరగాలి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటి విచారణ చేయాలని కోర్టును కోరారు. మొదటి రోజు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకొని వైసీపీ నేతలు వీరంగం చేశారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. ఆధారం లేకుండా చంద్రబాబు లడ్డూ విషయంపై ఎలా మాట్లాడాడని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిందని, చంద్రబాబు దొరికిపోయారు, శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. మేము సత్యహరిశ్చంద్రులం అన్నట్లుగా తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేశారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు వ్యతిరేకించలేక, పూర్తి స్థాయిలో కోర్టు తీర్పును స్వాగతించలేక వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అంబటి రాంబాబు వంటి నేతలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. కానీ, విచారణ బృందంలో చంద్రబాబు నాయుడు మనుషులు ఉండొద్దని అంటున్నారు. అంటే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు విచారణ బృందంలో ఉన్నా వారు చంద్రబాబు మనుషులే అని ముద్రవేయడంతో పాటు, కేంద్రం తరఫునుంచి అంటే సీబీఐ నుంచి నుంచి విచారణ బృందంలో ఉన్నవారిని కూడా చంద్రబాబు మేనేజ్ చేస్తారు అనే తప్పుడు వాదనను ఇప్పటి నుంచే ప్రజల్లోకి తీసుకెళ్లేలా వైసీపీ నేతల వ్యూహం ఉందన్న విషయం అంబటి మాటలతో తేటతెల్లమైపోయింది. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఓసారి పరిశీలిస్తే. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలి. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలి.
సరే కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ఎదుట కీలక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని చెప్పారు. అయితే, తిరుమల శ్రీవారికి దేశ వ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే విచారణపై మరింత విశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదు అని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్ దారుడు కోరినట్లు కమిటీని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించడానికి ధర్మాసనం విముఖత చూపింది. అయితే, వైసీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలచుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. అయితే, వైసీపీ నేతలు మాత్రం ఈ వ్యాఖ్యలన్నీ చంద్రబాబును ఉద్దేశించినవి అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు చంద్రబాబుకు చివాట్లు పెట్టిందని పోస్టులు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రయత్నిస్తున్నారు.
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనేది వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితోపాటు వైసీపీ నేతలకు కూడా తెలుసు. కానీ, తప్పును ఒప్పుకోకుండా.. తాము తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ఎదురు దాడి చేస్తున్నారు. సిట్ విచారణ చేసినా.. స్వతంత్ర దర్యాప్తు బృందం ద్వారా విచారణ చేయించినా తప్పు చేశాం కాబట్టి తమకు వ్యతిరేకంగానే ఫలితం వస్తుందని జగన్ ముందే ఫిక్స్ అయిపోయారనీ, అందుకే ఈ ఎదురుదాడి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విచారణలో కల్తీ నెయ్యి వాడారని తేలినా.. ఆ విచారణ అంతా తప్పుడు విచారణ అని, చంద్రబాబు కనుసన్నల్లోనే విచారణ జరిగిందని చెప్పుకోవడానికి వీలుగా వైసీపీ అధిష్టానం ప్లాన్ రెడీ చేసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పదేపదే సోషల్ మీడియా, తమకు అనుకూల మీడియా ద్వారా మేము తప్పుచేయలేదు.. చంద్రబాబు ప్రోద్బలంతోనే విచారణ బృందం తప్పుడు రిపోర్టులు ఇచ్చిందంటూ ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నాలను వైసీపీ నేతలు ఇప్పటి నుంచే మొదలెట్టేశారని అంటున్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు తాజా తీర్పు జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నా.. విచారణలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని తేలినా.. విచారణ రిపోర్టు మొత్తం చంద్రబాబు మాయ అంటూ ఎదురుదాడికి జగన్ ఇప్పటి నుంచే సిద్ధమవుతుండటం ఆయనలోని భయాన్ని, తప్పు చేశామన్న అంగీకారాన్ని తెలియచెప్పుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.