రేవంత్ మౌనం దేనికి సంకేతం?
posted on Oct 5, 2024 9:46AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుకు పెట్టింది పేరు. ఏ విషయంలోనైనా సరే ఆయన మాటలు తూటాల్లా పేలతాయి. మరీ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడంలో ఆయన దిట్ట. ఏదైనా వివాదం ఉత్పన్నమైతే మొట్టమొదట స్పందించేది రేవంత్ రెడ్డే. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టినది కూడా రేవంత్ లోని ఆయన దూకుడే. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాతే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంది.
అంతకు ముందు పదేళ్ల పాటు, అంటే రాష్ట్ర ఆవిర్భావం నుంచీ కూడా కాంగ్రెస్ రాష్ట్రంలో ఉనికి మాత్రంగానే మిగిలింది. అధికారం చేజిక్కించుకుంటున్నద ఆశ ఆ పార్టీ రాష్ట్ర నేతల్లోనూ, హై కమాండ్ లోనూ లేశ మాత్రమైనా కనిపించేది కాదు. అటువంటిది రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ గ్రాఫ్ ను అమాంతంగా పెంచేశారు రేవంత్. ఇందుకు ఆయన వాగ్దాటి, విషయంపై ఉన్న స్పష్టమైన అవగాహన, ప్రత్యర్థుల విమర్శలను దీటుగా తిప్పిగొట్టగలిగే సామర్ధ్యమే కారణం.
అయితే మంత్రి కొండా సురేఖ వివాదంపై మాత్రం రేవంత్ రెడ్డి మౌనం పరిశీలకులను సైతం విస్మ య పరుస్తోంది. కొండా సురేఖ సమంత, కొందరు హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలియనిదికి కాదు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను విమర్శిస్తున్నానంటూ ఆమె సినిమా హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. అన్ని వైపుల నుంచీ, అన్ని వర్గాల నుంచీ, చివరాఖరికి కాంగ్రెస్ నుంచి కూడా ఆమె వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం క్షమాపణలతో సరిపెట్టేసే తప్పు కాదు కొండా సురేఖది అంటున్నారు. పెద్దగా మీడియా ముందుకు రాని మహేష్ బాబు వంటి వారు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత బంధువులపై విమర్శల దాడి జరిగినప్పుడు కూడా కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లుగా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఘాటైన పదజాలంతో ఖబడ్డార్ అన్నట్లుగా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు.
ఇలా అన్ని వైపుల నుంచీ కొండా సురేఖ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వ్యాఖ్యల కారణంగా ప్రభుత్వం పరువు కూడా మసకబారిందని కాంగ్రెస్ వర్గాలే కారాలూ మిరియాలూ నూరుతున్నాయి. మంత్రి హోదాలో సురేఖ చచేసిన వ్యాఖ్యల ప్రభావం నిస్సందేహంగా రేవంత్ సర్కార్ పై కూడా పడుతుంది. పడుతుంది ఏమిటి పడింది కూడా. ఇక్కడే పరిశీలకులు ఇదేదో తుపాను ముందు ప్రశాంతతలా ఉందంటూ కాంగ్రెస్ వర్గాలలో అయితే మంత్రి సురేఖను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయంటున్నారు. లేదా ఆమెనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరే అవకాశాలున్నాయంటున్నారు. రేవంత్ మౌనం సంకేతమిదేనని అంటున్నారు.