ఇంతకీ మన్మోహన్ మోడీ నివాసానికి ఎందుకు వెళ్లినట్లో?

 

రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఒకరి గురించి మరొకరు, ఒకరి ప్రభుత్వం గురించి మరొకరు మీడియాలో విమర్శలు గుప్పించుకొంటుంటే రాజకీయాలలో అది చాలా సహజమని అందరూ భావించారు తప్ప ఏదో విడ్డూరంగా భావించలేదు. కానీ అంతగా ఒకరినొకరు విమర్శించుకొన్న తరువాత మోన్న సాయంత్రం డా.మన్మోహన్ సింగ్ ని మోడీ తన నివాసానికి ఆహ్వానించడం, ఆయన అభ్యర్ధనను మన్నించి డా.మన్మోహన్ సింగ్ నిన్న సాయంత్రం మోడీ నివాసానికి వెళ్ళడం, మోడీ ఆయనకు ఎదురేగి సాదరంగా ఆహ్వానించిలోనికి తోడ్కోనిపోయి, టీ ఫలహారాలు చేస్తూ వారిరువురు ముచ్చట్లు ఆడటం మాత్రం నిజంగా విడ్డూరమేనని అందరూ అనుకొంటున్నారు.

 

సుమారు అర్ధగంట సేపు సాగిన వారిరువురి సమావేశంలో దేశ ఆర్ధిక పరిస్థితిపైనే ప్రధానంగా చర్చ సాగిందని సమాచారం. కానీ అంతకంటే చాలా ముఖ్యమయిన విషయం గురించే వారిరువు చర్చించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోడీ అధికారం చేప్పట్టి ఏడాది పూర్తయింది గనుక ఆయనను అభినందించేందుకే డా. మన్మోహన్ సింగ్ మోడీ నివాసానికి వెళ్లి ఉంటారని అందరికీ అమోదయోగ్యమయిన కారణాన్ని కూడా చెప్పుకొంటున్నారు. నరేంద్ర మోడీ తమ ఫోటోని ట్వీటర్ లో పోస్ట్ చేసి “మళ్ళీ చాలా కాలం తరువాత మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ని కలుసుకొన్నందుకు చాలా సంతోషంగా ఉంది,” అంటూ ఒక మెసేజ్ కూడా పెట్టారు. కానీ మళ్ళీ రేపటినుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు యధావిధిగా తమ పోరాటాలు కొనసాగిస్తాయేమో? అయితే ఇంతకీ బద్ద శతృవులుగా వ్యవహరిస్తున్న వారిరువు ఎందుకు కలిసారు అనే ప్రశ్నకు సరయిన జవాబు మాత్రం దొరకనే లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu