ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడుదే
posted on May 28, 2015 2:17PM
.jpg)
హైదరాబాద్ నగరాన్ని ఐటి కేంద్రంగా మలిచి రాష్ట్రానికి పెద్ద ఆర్ధికవనరుని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడేనని తెరాసకు కూడా తెలుసు. కానీ రాజకీయ కారణాల చేత ఆ విషయాన్ని తెరాస నేతలు బహిరంగంగా అంగీకరించలేకపోతున్నారనే సంగతి కూడా అందరికీ తెలుసు. హైదరాబాద్ ని తను అభివృద్ధి చేసారు గనుక చంద్రబాబు నాయుడు అదే విషయం మహానాడులో చెప్పుకొంటే దానినీ తెరాస నేతలు తప్పుపట్టడం హాస్యాస్పదం.
అయితే అప్రస్తుతమయిన ఆ అంశాన్ని పట్టుకొని సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడం కూడా అనవసరమే. ఎందుకంటే తెదేపా ప్రభుత్వం సుమారు పదేళ్ళపాటు రాష్ట్రాన్ని పాలించింది. కనుక తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి అది చెప్పుకోవడం చాలా సహజం. కానీ నిన్న మొన్న అధికారం చేప్పట్టిన తెరాస పార్టీ తమ ప్రభుత్వం తను ఏమి చేసిందో చెప్పుకోవాలంటే మిగిలిన ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిచూపాల్సి ఉంటుంది. అప్పుడే గత కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాల పాలనతో, వాటి హయాంలో జరిగిన అభివృద్ధితో బేరీజు వేసుకొనే హక్కు పొందుతుంది. కానీ అధికారం చేప్పట్టి ఏడాది కూడా పూర్తి కాకుండానే గత ఆరు దశాబ్దాలలో కాంగ్రెస్, తెదేపాలు చేయలేని పనిని తాము చేసేస్తున్నామని గొప్పలు చెప్పుకొన్నట్లయితే రేపు అదే పాయింటు పట్టుకొని ప్రతిపక్షాలు మళ్ళీ తెరాస ప్రభుత్వాన్ని ఎదురు ప్రశ్నించవచ్చును.