పార్టీలో గుంట నక్కలతో జాగ్రత్త సుమీ
posted on May 28, 2015 9:54PM
.jpg)
ఈరోజు మహానాడులో మోత్కుపల్లి నరసింహులు మాటలు అందరినీ ముసిముసి నవ్వులు నవ్వుకొనేలా చేసాయి. ఆయన ప్రసంగిస్తూ, ఇంతకు మునుపు స్వర్గీయ ఎన్టీఆర్ తనను మంత్రిని చేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏకంగా గవర్నర్ ని చేస్తానని అంటున్నారని అన్నప్పుడు చంద్రబాబుతో సహా అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు. “మీరు గవర్నర్ అయితే ఇక్కడ కేసీఆర్ తో యుద్ధం చేసేవారు ఉండరని” చంద్రబాబు చమత్కరిస్తే తను గవర్నర్ అయినా కాకపోయినా తన ధ్యేయం మాత్రం వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ను ఓడించడమేనని మోత్కుపల్లి గడుసుగా జవాబిచ్చారు. “నేను ఇంకా గవర్నర్ కాకపోయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను గవర్నర్ గారని సంభోదిస్తుంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉందని” మోత్కుపల్లి అన్నప్పుడు అందరూ మరోమారు మనసారా నవ్వుకొన్నారు. కానీ మోత్కుపల్లి చెప్పిన ఒక మాట పార్టీలో ఎవరినో ఉద్దేశించి అన్నట్లుంది. కొంతమంది గుంటనక్కలు మన పార్టీలో ఉంటూ ప్రత్యర్ధి పార్టీలతో చేతులు కలుపుతూ తన వంటి వారిని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అటువంటి వారిపట్ల పార్టీ అధిష్టానం చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అయితే ఆ గుంటనక్క ఎవరనే సంగతి ఆయన బయటపెట్టకపోయినా అదెవరో పార్టీలో చాలా మందికి బాగా తెలుసట.