గోదావరిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. గోదావరిలో తేలుతూ ఇష్టమైన, రుచికరమైన ఆహారం తింటూ విహరించే  అద్భుత అనుభవం రాజమహేంద్రవరం వాసులకు అందుబాటులోకి వచ్చింది. పోలవరం- భద్రాచలం టూర్ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆ టూర్  మొత్తం రోజంతా పడుతుంది. అదో ఎక్స్ పీరియెన్స్ అయితే.. పెద్దగా సమయం వృధా అవ్వకుండా.. ఇలా హోటల్ కు వెళ్లి అలా వచ్చేసే అవకాశం ఉన్న ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు.  తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రారంభమైంది. రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో రెండు వంతెనల మధ్య ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు.

రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి.. రైల్వే ఆర్చి బ్రిడ్జి మధ్యలో బ్రిడ్జి లంక వద్ద ఏర్పాటైన ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ ఆదివారం (అక్టోబర్ 27) ప్రారంభించారు.  పద్మావతి ఘాట్‌ సమీపంలోని టూరిజం కంట్రోల్‌ రూమ్‌ నుంచి బోటులో పయనించి.. గోదావరి మధ్యలోని ఇసుక తిప్పలను ఆనుకుని నీటిలో తేలియాడుతున్న ఈ రెస్టారెంట్‌ వద్దకు చేరుకోవాలి.  రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఇది ఏపెన్ అయ్యి ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో శాకాహారం, మాంసాహారం రెండూ ఉంటాయి.  ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో ఒకే సారి  170 మంది  కూర్చునేందుకు అవసరమైన సిట్టింగ్‌ సామర్థ్యం ఉంది. సిల్వర్‌ స్పూన్‌, ఆహ్వానం కిచెన్‌ ప్రాంచైజీస్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ అండ్‌ మెయింట్‌నెన్స్‌ విధానంలో ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు.