అమెరికా సమాజంలోనూ మహిళల పట్ల వివక్ష

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. మొత్తం ప్రపంచం దృష్టి ఆ ఎన్నికలపైనే ఉంది. అయితే  ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష పీఠాన్ని మహిళ అధిరోహించిన చరిత్ర లేదు. ఈ సారైనా అధ్యక్ష పదవికి అమెరికన్లు మహిళను ఎన్నుకుంటారా? అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది.  గతంలో హిల్లరీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అయితే ఆమె ట్రంప్ చేతిలో పరాజయం పాలయ్యారు.  
ఈ సారి అమెరికా  అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్,భారత సంతతికి చెందిన కమలాహారిస్ పోటీపడుతున్నారు.  గతానికి భిన్నంగా ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్ పై ప్రచారంలో దాడి జరిగింది. అగంతకుడి తూటా నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.  ఈ ఘటన కారణంగా ట్రంప్ పై సానుభూతి వెల్లువెత్తుతుందని రిపబ్లికన్ లు ఆశిస్తున్నారు. నాలుగేళ్ల కిందట అంటే 2020లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి  బైడన్  చేతిలో పరాజయం పాలయ్యారు. నాలుగేళ్ల విరామం అనంతరం మళ్లీ ట్రంప్ బరిలో దిగారు. ఇప్పుడు డెమొక్రటిక్ అభ్యర్థిగా బైడన్ కాకుండా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ట్రంప్ ప్రత్యర్థిగా నిలబడ్డారు. వయోభారం కారణంగా బైడన్  స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుని ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కు అవకాశం ఇచ్చారు. 
అమెరికా ఆవిర్భావం తరువాత ఈ  235 సంవత్సరాలో అయి 46 మంది అధ్యక్షులు గెలిచినా వారిలో ఒక్క మహిళ లేకపోవడం అమెరికా సమాజంలో పురుషాధిక్యతకు నిదర్శనం అనడం కంటే ఆ సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉందనడానికి రుజువుగా చెప్పుకోవచ్చు. ట్రంప్ పై 2016లో హిల్లరీ క్లింటన్ పోటీ చేసి చివరివరకూ గట్టిపోటీ  ఇచ్చినప్పటికీ ఆమె గెలవలేకపోయారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తరువాత మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మహిళ నిలబడ్డారు.

 ఈ సారైనా అమెరికన్లు మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకుంటారని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అసలు ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష పదవి ఒక మహిళకు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. ప్రపంచంలోనే అత్యాధునిక దేశం,నాగరికతలో మేటి,స్వేచ్ఛా సమాజంగా పేరొందిన అమెరికాలో ప్రధాన పార్టీలు రెండూ కూడా మహిళలను అధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంచడం మహిళా వివక్షగానే చెప్పుకోవలసి ఉంటుంది. అమెరికా చరిత్రలో అధ్యక్ష బరిలో నిలబడిన తొలి మహిళగా హిల్లరీ క్లింటన్  రికార్డు సృష్టించారు. ఇప్పుడు 2024 ఈసారి కమలా హారిస్  పురుషాహంకారాన్ని ఆధిక్యతను ఎదుర్కొని విజయం సాధిస్తారా చూడాల్సి ఉంది. 

భారత్,శ్రీలంక,ఫిలిప్పీన్స్,ఫ్రాన్స్ వంటి దేశాల్లో దేశాధినేతలుగా మహిళలు 60,70దశకాల్లోనే ఎన్నికయ్యారు. అమెరికాలో ఇంతవరకూ మహిళా అధ్యక్షరాలు ఎన్నిక కాకపోవడం, అన్నిటికీ మించి 235 ఏళ్ల చరిత్రలో కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే అధ్యక్ష బరిలో మహిళలు నిలబడే అవకాశం రావడం అంటే అమెరికన్ సమాజంలో మహిళల పట్ల వివక్ష ఏ స్థాయిలో ఉందన్నది అవగతమౌతుంది.