ధర్మాన జంప్..కన్ ఫర్మేనా?

ధర్మాన ప్రసాదరావు.. తెలుగు రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం. వైఎస్ హయాంలో రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాయకుడు. వైఎస్ మరణం తరువాత ధర్మాన ప్రసాదరావు వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీలో ఎన్నడూ ఆయనకు ఆయన స్థాయికి తగిన పదవి కానీ, ప్రాధాన్యత కానీ దక్కలేదు. అయినా ధర్మాన వైసీపీలోనే కొనసాగారు. ఇటీవలి ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం తరువాత ఆయన పెద్దగా ఎక్కడా కనిపించిందీ, వినిపించిందీ లేదు. ఇప్పుడు ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని ఆ పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది. 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్   నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాలలో కీలకంగా, చురుకుగా వ్యవహరించిన నేత. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్ పై అంత కంటే ఎక్కువగా తన కుమారుడు  ధర్మాన రామ్ మనోహర్ నాయుడు రాజకీయ భవిష్యత్ పై ఎక్కవ ఆందోళనగా ఉన్నారు. మూడు దశాబ్దాలకు పైగా శ్రీకాకుళం జిల్లాలో తిరుగులేని నేతగా వెలుగొందిన ధర్మాన ప్రసాదరావు.. ఇప్పుడు రాజకీయ అండ కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి.  రెండు సార్లు నరసన్నపేట నుంచి, మూడు సార్లు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ధర్మాన ప్రసాదరావు.. ఇటీవలి ఎన్నికల్లో  తెలుగుదేశం అభ్యర్థి గొండు శంకర్ చేతిలో  పరాజయం పాలయ్యారు. తన కంటే ఎంతో జూనియర్ అయిన గొండు శంకర్ చేతిలో పరాజయాన్ని ధర్మాన ప్రసాదరావు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అనుయాయులు అంటున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే ధర్మాన పోటీకి విముఖత వ్యక్తం చేశారు. తన స్థానంలో శ్రీకాకుళం  అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా తన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేత జగన్ ను కోరారు. అయితే అందుకు జగన్ ససేమిరా అనడంతో అయిష్టంగానే బరిలోకి దిగారు. పరాజయం పాలయ్యారు.   

ఇక అప్పటి నుంచీ ఆయన రాజకీయంగా పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. అదే సమయంలో తన కుమారుడి రాజకీయ భవిష్యత్ పై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వైసీపీలో ఉంటే తన కుమారుడికి రాజకీయ భవిష్యత్ ఉండదని భావిస్తున్న ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేన లేదా తెలుగుదేశం గూటికి చేరాలని ప్రయత్నిస్తున్నట్లు సిక్కోలు పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇరు పార్టీల నుంచీ కూడా ఆయన ప్రయత్నాలకు ఇంత వరకూ సానుకూల స్పందన రాలేదని అంటున్నారు.  ఒక దశలో ధర్మాన తెలుగుదేశం గూటికి చేరడం దాదాపు ఖరారైపోయిందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే అవన్నీ ఒట్టి ఊహాగానాలుగానే మిగిలిపోయాయి.

ఇప్పుడు తాజాగా ధర్మాన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు జనసేన తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. ఈ విషయంలో ధర్మాన నుంచి కానీ రామ్ మనోహర్ నాయుడి గురించి కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు కానీ, ధర్మాన ఎంట్రీకి నో చెప్పని జనసేనాని ఆయన కుమారుడిని పార్టీలో చేర్చుకునే విషయంలో ఒకింత సానుకూలంగా ఉన్నారని వినిపిస్తోంది.  అయితే ఈ విషయంలో వాస్తవాలపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.