షర్మిలే రైట్.. వైసీపీ అంగీకరించేసిందా?

చేతులు పూర్తిగా కాలిపోయాకా.. ఆకుల కోసం వెతికినట్లుంది వైసీపీ తీరు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస ముందు చూపుకూడా లేని పార్టీగా ఇప్పటికే వైసీపీ పలు సందర్భాలలో రుజువు చేసుకుంది. ఆ పార్టీ పూర్తిగా వైసీపీ అధినేత జగన్  ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడిచే పార్టీ. అధికారంలో ఉన్న ఐదేళ్లూ దోచుకోవడం, దాచుకోవడం, ప్రత్యర్థులపై దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులు అన్నట్లుగా సాగింది. ఎందుకంటే అవే జగన్ కు ఇష్టం కనుక. ప్రత్యర్థులను అనుచిత వ్యాఖ్యలతో విమర్శించే వారికే పార్టీలో గుర్తింపు అన్న విధానం కారణంగా ఆ పార్టీ నేతలంతా నోరేసుకుని పడిపోయేవారు. బూతుల పంచాంగంలో నిష్ణాతులుగా గుర్తింపు పొందారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ అభివృద్ధి మాటే ఎత్తక, కేవలం కక్ష సాధింపు చర్యలే పాలన అన్నట్లుగా వ్యవహరించిన కారణంగానే జగన్ పార్టీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక అధికారం కోల్పోయిన తరువాతైనా పార్టీ అధినేతలో, నేతల్లో మార్పు వచ్చిందా అంటే లేదనే చెప్పాలి. ఈవీఎంల కారణంగానే ఓడిపోయాం. ప్రజా మద్దతు తమవైపే అంటూ స్వోత్కర్ష వినా.. పార్టీ ఓటమికి కారణాలపై ఇంత వరకూ ఆ పార్టీ సమీక్షించింది లేదు. ఆత్మ విమర్శ చేసుకున్నది లేదు. 

ఇక తాజాగా జగన్, ఆయన సోదరి మధ్య ఆస్తి తగాదా పార్టీ ప్రతిష్టను మరింతగా దిగజార్చింది. వైఎస్ కుటుంబ ప్రతిష్ఠను పాతాళంలోకి పడిపోయేలా చేసింది. అయితే షర్మిలపై జగన్ ఏమైనా మాట్లాడితే ఏదో సొంత గొడవ అనుకోవచ్చు. కానీ షర్మిలపై విమర్శలు గుప్పించడం, ఆమె ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయడమే పార్టీ విధానం అన్నట్లుగా  పార్టీ నేతలు మైకుల ముందుకు వచ్చి చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి తీరని నష్టం చేశాయి చేస్తున్నాయి.

ఈ రెండు వారాలలో వైసీపీ నేతలు షర్మిలను దూషించడానికే తక్కువలో తక్కువ రెండు డజన్ల ప్రెస్ మీట్లు పెట్టారు. కేతిరెడ్డి, జూపూడి, పేర్నినాని, రాచమల్లు, సతీష్ రెడ్డి, సుధాకర్ బాబు, వరుధు కల్యాణి, గుడివాడ అమర్నాథ్, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి.. ఇలా వైసీపీ నేతలందరూ షర్మిలపై బురద జల్లడానికే మైకుల ముందుకు వచ్చారు. ఇక జగన్ సొంత మీడియా  అయితే షర్మల వ్యక్తిత్వ హననమే లక్ష్యం అన్నట్లుగా డిబేట్లు నిర్వహించింది. కథనాలు వండి వార్చింది. అయితే ఆలస్యంగానైనా షర్మిల విషయంలో పార్టీ పరంగా ఇలా విరుచుకుపడటం వల్ల ప్రయోజనం సంగతి అటుంచి నష్టం జరుగుతోందని తెలుసుకున్న వైసీపీ ఇప్పుడు షర్మిలకు వ్యతిరేకంగా నోరెత్తవద్దని నిర్ణయించుకుంది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియాలో షర్మిలపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేద్దామని పిలుపు నిచ్చింది. కోర్టులు ఉన్న అంశం కనుక అక్కడే తేల్చుకుందామని, రాజకీయ చర్చలు వద్దని స్ఫష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన చేసింది.  

అయితే అసలీ రచ్చను మొదట మొదలెట్టిందే వైసీపీ. జగన్ సహా ఆ పార్టీ నేతలంతా మూకుమ్మడి దాడి చేసినట్లుగా షర్మిలపై విరుచుకుప్పడారు. కనీస లాజిక్ కూడా అందకుండా.. వైఎస్ మరణాన్ని తెలుగుదేశం, కాంగ్రెస్ లకు ఆపాదిస్తూ అటువంటి వారి మేలు కోసం షర్మిల పని చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఆస్తుల విషయంలో షర్మిలను జగన్ దగా చేశారని జనం నమ్ముతున్నారనీ, ఈ విషయంలో తాము షర్మిలపై ఎంతగా విమర్శలు చేస్తే అంతగా నష్టపోవడం ఖాయమనీ నిర్ధారించుకున్న తరువాత ఇక ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే అప్పటికే అలస్యమైపోయింది. షర్మిల విషయంలో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ప్రతిష్ఠ పూర్తిగా మంటగలిసిపోయింది. చేతులు పూర్తిగా కాలిపోయిన తరువాత ఇప్పుడు ఆకుల కోసం వెదుకుతున్న చందంగా వైసీపీ షర్మిల విషయంలో ఇక నోరెత్తకూడదని తీసుకున్న నిర్ణయం వల్ల వైసీపీకి ఒనగూడే ప్రయోజనం ఏం లేదు సరికదా.. ఇప్పటి దాకా తాము చేసిన విమర్శలన్నీ తప్పు, అవాస్తవాలని స్వయంగా ఒప్పుకున్నట్లైంది.